అమెరికాలో ‘హాలోవీన్’ సందడి!

18 September, 2019 - 12:07 AM

(డి.వి.రాధాకృష్ణ)

వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ‘దెయ్యాల పండగ’ (హాలోవీన్) సందడి అప్పుడే మొదలైంది. దేశంలోని ఏ షాపింగ్ మాల్‌కు వెళ్ళినా దెయ్యాల పండగ కస్ట్యూమ్‌లు, మాస్క్‌లు పెద్ద ఎత్తున విక్రయానికి పెట్టి ఉన్నాయి. వాల్‌మార్ట్, కాస్ట్‌కో, టార్గెట్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనే కాకుండా అంతకన్నా కొంచెం చిన్న మాల్స్‌లోనూ హాలోవీన్ దుస్తులు, మాస్క్‌లు దర్శనం ఇస్తున్నాయి. ఏ షాపులో చూసినా పుర్రెలు, అస్థిపంజరాల బొమ్మలు కనిపిస్తున్నాయి. ఒక్క హాలోవీన్ పండుగ సమయంలో అమెరికా వ్యాప్తంగా అనేక వందల బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. నిజానికి హాలోవీన్ దుస్తులే కాకుండా వందలాది టన్నుల చాక్లెట్ల వ్యాపారం కూడా ఈ పండుగ సమయంలోనే జరుగుతుంది. షాపింగ్ మాల్స్ అన్నింటిలోనూ రకరకాల చాక్లెట్లు, వివిధ సైజులు, ఆకారాల్లో విక్రయానికి ఉన్నాయి. అమెరికన్లే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ నివసించే వారు కూడా ఈ హాలోవీన్ కొనుగోళ్ళు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. భారతదేశం నుంచి.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉద్యోగారీత్యా వచ్చి అమెరికాలో స్థిరపడిన వారి పిల్లలు కూడా హాలోవీన్ పండగలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఉరకలు వేస్తున్నారు.హాలోవీన్ పండగను ప్రతి ఏటా అక్టోబర్ 31న అమెరికా, బ్రిటన్‌లోనే కాకుండా అనేక దేశాల్లో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పండగలు దేవుళ్ళకే కాదు.. దెయ్యాలకూ ఉంటాయనేది ఉత్తర అమెరికా ప్రజలు విశ్వాసం. ప్రతి ఏటా అక్టోబర్ 31న ప్రాణం ఉన్నవారికి.. మరణించిన వారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని వీరి నమ్మకం. అందుకే ఈ దెయ్యాల పండగను తప్పకుండా ప్రతి ఏటా సెలబ్రేట్ చేస్తారు. ఆల్ హలో ఈవెనింగ్ నుంచి ఈ హాలోవీన్ పుట్టింది. దీన్ని ఆల్ సెయింట్స్ డే అని కూడా పిలుస్తారు. హాలోవీన్ రోజున హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రల మాదిరిగా వికృత వేషధారణల్లో పిల్లలు పెద్దలూ కూడా కనిపిస్తుంటారు. పిల్లలతో నిర్వహించే ఆకతాయి ఆట ట్రిక్ ఆర్ ట్రీట్. ఈ ఆట బాగా ప్రాచుర్యం పొందింది. పిల్లలు బుజ్జి మంత్రగత్తెల్లా మారిపోయి బకెట్లు పట్టుకుని ఇంటింటికీ వెళ్లి చాక్లెట్లు సేకరిస్తారు. అలా సేకరించిన చాక్లెట్లను తమ సొత్తులా దాచుకుంటుంటారు. ఇలా సేకరించిన చాక్లెట్లను ఒక నిధిలా దాచుకుని వారు ఇంచుమించు సంవత్సరం అంతా తింటుంటారు. పిల్లలు ట్రిక్ ఆర్ ట్రీట్ అన్నపుడు మేం ట్రిక్ చేయలేం కానీ.. ఇదిగో ట్రీట్ అంటూ పెద్దలు చాక్లెట్లు ఇస్తారు. ఇళ్ల దగ్గర పెద్దవారు కూడా హాలోవీన్ పండగ రోజు సాయంత్రం చాక్లెట్లను పెట్టుకుని ఇంటి గుమ్మం ముందు కూర్చొని అటువైపు వచ్చిన పిల్లలకు ఆనందంగా పంచెపెడతారు.

నిజానికి  దెయ్యాల పండగ పుట్టింది ఐర్లాండులో. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు దెబ్బకు ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. పంట కోతల కాలం ముగింపు సందర్భంగా నిర్వహించే వేడుక క్రమేణా ప్రపంచమంతా పాకింది. రోమన్ పాలనకు ముందు బ్రిటన్, స్పెయిన్, గాల్ ప్రాంతాలను ఆక్రమించిన యూరోపియన్లు హాలోవిన్‌ను కొత్త సంవత్సరం వేడుకగా జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది.హాలోవీన్ పండగ రోజున పూర్వకాలంలో పశువులను బలి ఇచ్చి, వాటి ఎముకలను కాల్చేవారట. చెడు ఆత్మలను అనుకరిస్తూ.. దెయ్యాలు, మంత్రగత్తెల్లా వస్త్రాలు ధరించడం ఈ పండగరోజు సాంప్రదాయంగా వస్తోంది. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మాత్రమే జరిగిన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచమంతా పాకింది.

హాలోవీన్‌లో అంత్యంత ముఖ్యమైనది జాక్-ఒ-లాంతర్. అంటే గుమ్మడికాయలో లాంతర్లను ఏర్పాటు చేసి అలంకరించడం. వ్యసనపరుడైన జాక్ అనే ముసలి రైతు.. తనని ఎంతో విసిగిస్తున్న దయ్యాన్ని చెట్టు ఎక్కించి శిలువగా మార్చేస్తాడట. దీంతో.. ఆ దెయ్యం జాక్‌ను లాంతర్‌తోనే భూమిపై తిరగాలని శపిస్తుందని చెబుతారు. అందుకే.. హాలోవీన్‌లో గుమ్మడికాయల లాంతర్లనే వాడతారు. ఆ రోజు సాయంత్రం చీకటి పడగానే గుమ్మడికాయ లాంతర్లను తమ తమ గుమ్మాల ముందు ఉంచుతారు.హాలోవీన్ రోజున నలుపు, నారింజ రంగుల వస్త్రాలే ఎక్కువ ధరిస్తారు. ఇది రైతుల పండుగ కాబట్టి.. గుమ్మడికాయలు.. వాటితో చేసిన బొమ్మలు.. డిజైన్లను పూర్వకాలంలో ఇచ్చేవారు. ఇప్పుడు వీటిని చాక్లెట్లు మింగేశాయి. మారుతున్న కాలానుగుణంగా పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలూ మారిపోవడం ఈ ప్రకృతి విశేషం.