జపాన్‌కు హగిబిస్ తుపాను ముప్పు

13 October, 2019 - 2:41 AM

(న్యూవేవ్స్ డెస్క్)

టోక్యో: పసిఫిక్ మహాసముద్రంలో తరచూ భూకంపాల తాకిడికి గురయ్యే జపాన్ ఇప్పుడు ఒక భయంకర విపత్తు ముంగిట అల్లాడుతోంది. 1958 తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో వచ్చిన ఒక టైఫూన్ జపాన్‌ను వణికిస్తోంది. ఈ అతి తీవ్ర టైఫూన్‌కు హగిబిస్ అని పేరుపెటంటారు. ఫిలిప్పీన్స్ భాషలో హగిబిస్ అంటే వేగం అని అర్థం. ఇది పేరుకు తగ్గట్టే జపాన్ ప్రధాన భూభాగం దిశగా దూసుకువచ్చింది. ఇప్పటికే జపాన్ అధీనంలోని దీవులను తుడిచిపెట్టిన హగిబిస్ గురి రాజధాని టోక్యోపైనే ఉందని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. ఇజు ద్వీపకల్పం వద్ద తీరాన్ని దాటిన హగిబిస్ టోక్యోను తాకుతుందని అంటున్నారు.

కేటగిరీ 5 టైఫూన్‌గా కొనసాగుతున్న హగిబిస్ ధాటికి జపాన్ తూర్పుతీరం చిగురుటాకులా వణికిపోతోంది. గంటకు 195 మైళ్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తుండగా, కుండపోత వర్షంతో వరదలు ముంచెత్తుతున్నాయి. టోక్యో దాని పరిసర ప్రాంతాల్లో 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చన్నది స్థానిక వాతావరణ సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైఫూన్ భయంతో జపాన్ ప్రజలు ముందుగానే నిత్యావసరాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో డిపార్ట్‌మెంటల్ స్టోర్లు బోసిపోయినట్టు కనిపిస్తున్నాయి.