న్యూజిలాండ్‌లో నరమేధం.. 49 మంది మృతి

15 March, 2019 - 11:41 AM

(న్యూవేవ్స్ డెస్క్)

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని హగ్లీపార్క్‌ శుక్రవారం ఉదయం దుండగులు మెషీన్ గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. నగరంలోని రెండు మసీదుల్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందినట్లు న్యూజిలాండ్ ప్రధాని వెల్లడించారు. ఇంకా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి తృటిలో తప్పించుకుని సురక్షితంగా బయటపడింది. మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్‌ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో అల్‌ నూర్‌ మసీదులో సుమారు 300 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మసీదులో చాలా మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే లిన్‌‌వుడ్‌ మసీదులో మరో ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఒంటినిండా ఆయుధాలతో ఉన్న ఆ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మసీదు వద్ద పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలతో రెండు మసీదులు రక్తసిక్తమయ్యాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు పరుగు పెట్టారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. క్రైస్ట్‌‌చర్చ్‌ సిటీలోని ప్రజలెవరు బయటకు రావద్దని సూచించారు.వెల్లింగ్టన్‌లో శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌‌కు సమయాత్తం అవుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులో ఉన్న సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. దుండగుల కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టమూ జరగలేదని బంగ్లాదేశ్‌ కోచ్‌ మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. అల్లాయే తమను రక్షించారని ముష్పికర్‌ రహీమ్‌ ట్వీట్‌ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని పేర్కొన్నాడు.

మరోవైపు దాడికి పాల్పడిన దుండగుడు ఇంకా ఘటనా స్థలం వద్దే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు భద్రతా సిబ్బంది ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు కాల్పులు జరిపాడా? లేదా వారికి సహకరించడానికి అక్కడకు వచ్చాడా? అన్నది తెలియాల్సి ఉంది.

అల్‌ నూర్‌ మసీదు వద్ద కాల్పులకు తెగబడిన దుండగుడు దాడినంతా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు న్యూజిలాండ్‌ మీడియా పేర్కొంది. మొత్తం 17 నిమిషాల పాటు కాల్పుల లైవ్‌ స్ట్రీమింగ్‌ జరిగినట్లు తెలిపాయి. ఆ వీడియో ప్రకారం దుండగుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్‌ టారెంట్‌ అని తెలుస్తోంది. కారులో వచ్చిన దుండగుడు అల్‌ నూర్‌ మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపాడు. ఆ తర్వాత మసీదులోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. అతడి కారులో మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, పెట్రోలు కేన్లు ఉన్నట్టు న్యూజిలాండ్ హెరాల్డ్ పేర్కొంది. ఈ లైవ్‌ స్ట్రీమ్‌ వీడియోను షేర్‌ చేయవద్దని ప్రజలకు న్యూజిలాండ్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

కాల్పుల ఘటనపై న్యూజిలాండ్‌ ప్రధాని జెసిందా ఆర్డెర్న్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ చీకటి రోజుల్లో ఇది ఒకటని, హింసకు తీవ్రమైన రూపమని ఆమె పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో ఆమె వెల్లింగ్టన్‌ బయల్దేరారు.