ఇద్దరు టెర్రరిస్టుల ఎన్‌కౌంటర్

12 May, 2019 - 12:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో తుపాకుల మోత కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచీ షోపియాన్ జిల్లా హింద్‌ సీతాపొర ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. టెర్రరిస్టులు ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో నక్కి ఉన్నారనే పక్కా సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్‌, కశ్మీర్‌ సాయుధ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా సైనిక దళాలు ఎదురుదాడి చేశాయి. సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు లభించాయి. మరికొందరు టెర్రరిస్టులు అదే ప్రాంతంలో దాగి ఉన్నారు. దీంతో ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.