గుజరాత్‌లో ట్రాఫిక్ ఫైన్లు తగ్గింపు

11 September, 2019 - 1:39 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అహ్మదాబాద్‌: నూతన మోటారు వాహన సవరణ చట్టంపై ప్రజలు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన మోటారు వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనులపై పెద్ద మొత్తంలో జరిమానాల మోత మోగిపోతోంది. దీంతో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలుచేస్తూనే.. దాని ప్రకారం విధిస్తున్న జరిమానాల మొత్తాలను సగానికి సగం తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనాలను బయటికి తీసుకురావాలంటేనే భయపడుతున్న వాహనదారులకు గుజరాత్ గవర్నమెంట్ కొంత ఊరట కలిగించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని కేంద్రం అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారుడికి ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయలు ఫైన్ చెల్లించుకోవాల్సి వస్తోంది. గుజరాత్ సర్కార్ ఈ రెండు జరిమానాలను సగానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్లు నడిపితే రూ.5 వేలు కొత్త చట్టం ప్రకారం జరిమానా పడుతోంది. దీన్ని రూ.3 వేలకు ప్రభుత్వం తగ్గించింది. అదే ద్విచక్ర వాహనాన్ని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే జరిమానాను రూ.2 వేలకు కుదించారు.

భారీగా ట్రాఫిక్‌ చలాన్లు విధిస్తుండటంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కొత్త చట్టం ప్రకారం జరిమానాలు గతంలో కంటే పది రెట్లు ఎక్కువగా ఉననాయన్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై తాజాగా విధిస్తున్న జరిమానాలను తగ్గిస్తున్నామని ప్రకటించారు. ఈ అంశంపై నిశితంగా పరిశీలించిన తర్వాతే తమ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని గుజరాత్‌లోని అదే పార్టీ సర్కారే యథాతథంగా అమలు చేయకపోవడం విశేషం. సాక్షాత్తూ గుజరాత్‌లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో పలు రాష్ట్రాలు కూడా ఇదే దారిలో వెళ్ళే అవకాశముందని అంటున్నారు.

గుజరాత్‌ సర్కార్ సవరించిన జరిమానాలివి..:

  • హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000 జరిమానా విధిస్తుండగా.. దానిని రూ.500కి తగ్గించింది.
  • డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతేరూ. 5 వేలు జరిమానా విధిస్తుండగా.. దానిని ఫోర్ల వీలర్ అయితే.. రూ.3 వేలు, ద్విచక్ర వాహనం అయితే.. రూ.2 వేలకు తగ్గించింది.
  • సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూపట్టుబడితే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది.
  • ఆర్సీ, పీయూసీ, ఇన్సూరెన్స్ తదితరపేపర్లు లేకపోతే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది.
  • ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1,000 జరిమానాను ఏకంగారూ.100కి తగ్గించింది.
  • వాహన కాలుష్యంపై రూ.10 వేల జరిమానాను చిన్న వాహనాలకు రూ.1,000, పెద్ద వాహనాలకురూ. 3 వేలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రజలు ట్రాఫిక్ చట్టాలను చాలా తేలికగా తీసుకుంటున్నారని, చట్టం పట్ల భయం కానీ, గౌరవం కానీ లేనందుకే కఠినమైన చట్టం తీసుకొచ్చామని మోటారు వాహన చట్టం సవరణ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జరిమానాలు తగ్గించడం ద్వారా గడ్కరీ అభిప్రాయంతో రూపానీ ప్రభుత్వం పరోక్షంగా విభేదించినట్టయిందని నెటిజన్లు అంటున్నారు.