రూపాయి బిళ్ల రద్దు…!

08 January, 2018 - 8:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

రాంపూర్‌: పెద్ద కరెన్సీ నోట్లను ఒక్క ప్రకటనతో ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసి పారేసిన విషయం మనందరి అనుభవంలోకి వచ్చిందే కదా..? అయితే.. ఇప్పుడా దుస్థితి రూపాయి నాణానికి కూడా పట్టనున్నది. అంటే.. రూపాయి నాణెంను రద్దు చేసేది ప్రధానో.. ప్రభుత్వమో అని కంగారు పడొద్దు సుమా..! వీటిని రద్దు చేసింది బెగ్గర్లు..! నిజమే మీరు ఈ విషయాన్ని సరిగ్గానే చదువుతున్నారు.

విషయం ఏంటంటే.. యాచకులకు రూపాయి నాణెంను దానంగా వేస్తున్నారా? అయితే ఇక నుంచి వాటిని వారు తీసుకోరట!ఉత్తర ప్రదేశ్‌‌లోని రాంపూర్‌‌లో యాచకుల గ్రూప్‌ రూపాయి నాణెంను ఇకపై దానంగా తీసుకోకూడదని నిర్ణయించింది. రూపాయి నాణెంను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినట్టుగానే, ఇక మీదట తాము కూడా రూపాయి నాణెంను రద్దు చేస్తున్నామని, దీని సైజు 50 పైసల మాదిరి ఉందని యాచకుడు శుక్ర మని చెప్పాడు. రూపాయి నాణాలను తమ వద్ద నుంచి కూడా స్వీకరించవద్దని దుకాణదారులకు, రిక్షావారిని కూడా కోరినట్టు యాచకులు చెప్పారు. ఇక నుంచి యాచకులకు ఎవరు దానం చేయాలన్న రూపాయి కంటే ఎక్కువ ఇచ్చి తీరాల్సిందే.