మదింపు.. కుదింపు

08 November, 2019 - 5:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రోటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థానంలో జెడ్ ప్లస్ కేటగిరి కింద సీఆర్‌పీఎఫ్ జవాన్ల భద్రతను ఆ కుటుంబానికి కల్పించనుంది. ఈ మేరకు శుక్రవారం కేంద్రం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దాంతో ఇకపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలకు జెడ్ ప్లస్ కేటగిరి కింద భద్రత కల్పించనున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఇటీవల న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి భద్రత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ ఆధారంగా సోనియా గాంధీకుటుంబానికి కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతపై మదింపు వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో దేశంలో ఎస్పీజీ భద్రత పర్యవేక్షణ ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కల్పించినుంది.

అయితే ఈ ఏడాది ఆగస్టులో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కి ఉన్న ఎస్పీజీ భద్రతను కేంద్రం తొలగించింది. ఆ స్థానంలో ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే.

1984లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని భద్రత సందిగ్ధంలో పడింది. దాంతో స్పెషల్ ప్రోటక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) తెరపైకి వచ్చింది. 1985, ఏప్రిల్ 8న ఎస్పీజీని ఏర్పాటు చేశారు. అత్యున్నత స్థాయి అంటే.. భారత ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించడం ఎస్పీజీ ప్రధాన ఉద్దేశ్యం. ఇక జెడ్ ప్లస్ కేటగిరి అంటే.. ఇందులో నేషనల్ సెక్యూరిటీ గార్డు కమాండోలు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ మరియు ఢిల్లీ పోలీసులు ఉంటారు.

ఇక భారత రాష్ట్రపతికి ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేదు. దీంతో ఆయనకు ఎస్పీజీ భద్రత కల్పించదు. భారత రాష్ట్రపతి భద్రతను ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రెసిడెంట్ బాడీ గార్డు (పిబిజీ) పర్యవేక్షిస్తారు. ఈ ప్రెసిడెంట్ బాడీ గార్డు రెజిమెంట్ అనేది అత్యంత పురాతనమైనది.