సాహోరే బాహుబలి…

26 April, 2017 - 1:46 AM

(వ్యంగ్యవార్తావిభాగం ప్రత్యేక ప్రతినిధి)

బాహుబలి-2 ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్ననేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా సెలవు ప్రకటించాయి. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్  1881 ప్రకారం బాహుబలి విడుదల రోజున సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎవ్వరూ వ్యక్తిగత సెలవు పెట్టుకోనక్క రలేకుండా సినిమాకు వెళ్లే వీలు కలిగింది. పెద్ద యెత్తున ప్రభుత్వోద్యోగులు ఏప్రిల్ 28 న మూకుమ్మడిగా సెలవులకు దరఖాస్తు చేసుకోవడంతో ఇరు ప్రభుత్వాలు ఉన్నతస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజున లేబర్ హాలీడే ఉంటుందనీ, అందుకే దుకాణాల వంటివి కూడా ఎక్కడా తెరిచి ఉండరాదనీ, ఈ ఆదేశాలను అతిక్రమిస్తే కేసులు తప్పవనీ ప్రభుత్వవర్గాలు హెచ్చరించాయి. ఇలా సెలవు ప్రకటించడం పట్ల ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఇదిలావుండగా బాహుబలి -2 ది కంక్లూజన్ విడుదల సందర్భంగా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ఉభయ తెలుగు రాష్ట్రాల డీజీపీలు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. థియేటర్ల దగ్గర తొక్కి సలాటలు, తోపులాటలు, దొమ్మీలు జరగకుండా రౌడీషీట్ ఉన్నవారందరినీ ముందుగానే అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే పారా మిలటరీ బలగాలను ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీకి సూచించారు. ఏకంగా ఆరేసి షోలకు అనుమతినిచ్చినందున రద్దీ అనివార్యమనీ, అందుకే నగరాల్లో థియేటర్లకు వెళ్లే దారులలో వేరే వాహనాలను అనుమతించకుండా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందనీ ఏపీ ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రకటించింది. ఈ దృష్ట్యా ఆ రోజున అత్యవసర పనుల కోసం మివహా ప్రేక్షకులు కానివారు మరిదేనికీ బయటకు వచ్చే పని పెట్టుకోరాదని ప్రజలకు సూచించింది.

మరోవైపు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో ఇప్పుడైనా చెప్పాలంటూ ఒత్తిడి బాగా పెరిగిపోవడంతో చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్‌తో సహా పలువురు సీనియర్ నటులకు, టెక్నీషిన్లకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది. బాహుబలి క్రేజ్‌ను అనుకూలంగా ఉపయోగించుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న బీజేపీ, ఎన్డీఏ మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు సహకారంతో, పార్టీలో సభ్యత్వం తీసుకునేవారికి లక్కీ డ్రాలో మూవీ టిక్కెట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ట్రెండీగా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి బాహుబలి- 2కు బెస్టాఫ్ లక్ చెబుతూ ట్వీట్ చేశారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ బాహుబలికి కట్టప్ప వెన్నుపోటుతో తన తండ్రి చంద్రబాబుకి ఎలాంటి పోలికా లేదంటూ వ్యాఖ్యానించారు. అలా సోషల్ మీడియాలో పోస్టులు ఎవరైనా పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. దీనిని వైఎస్ఆర్‌సీపీ వేరొక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.

పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పోటీ పడి బాహుబలి థియేటర్ల వద్ద ప్రేక్షకులకు చలివేంద్రాలు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. బాహుబలి -2 ది కంక్లూజన్ వల్ల షేర్ మార్కెట్లు కూడా మందకొడిగా సాగ వచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విమాన, రైలు సర్వీసులు కూడా బాహుబలి విడుదల రోజున ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం కూడా బాహుబలి పరిణామాల పట్ల అప్రమత్తం అయింది. కేంద్ర హోం శాఖ వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఈ అంశంపై సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలిలో కట్టప్ప ట్విస్ట్ పై బెట్టింగ్‌కు పాల్పడు తున్న రెండు ముఠాలను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.