‘రీపోలింగ్‌కి ఆమోదం రావాలి’

25 April, 2019 - 5:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఓట్ల లెక్కింపు కోసం 21 వేల మంది సిబ్బంది అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోలర్ అపీసర్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గురువారం అమరావతిలో ద్వివేది విలేకర్లతో మాట్లాడుతూ… ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎవరు పాల్గొంటారో తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రెండు సార్లు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ చేస్తామని చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభ పరిధిలోని ఐదేసీ పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు. ముందుగా పోస్టల్, సర్వీస్ ఓటర్ల లెక్కింపు జరుపుతామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

అయితే టేబుళ్ల పెంపునకు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కాగా ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్ వైజర్, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. రీపోలింగ్‌కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం రావాల్సి ఉందన్నారు.