హర్ గోబింద్ ఖురానా‌కు గూగుల్ నివాళి

09 January, 2018 - 11:57 AM

(న్యూవేవ్స్ డెస్క్)

నోబెల్‌ బహుమతి గ్రహీత, భారత్-అమెరికన్‌ బయోకెమిస్ట్‌, తొలి కృత్రిమ జన్యూవు నిర్మాణంలో ఘనత పొందిన హర్‌ గోబింద్‌ ఖురానా‌కు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మంగళవారం ప్రత్యేక నివాళులర్పించింది. ఇవాళ ఆయన 96వ జయంతి పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేకంగా ఓ డూడుల్ రూపొందించింది. గూగుల్ హోం పేజీలో ఖురానా ఫోటో, ఆయన చేసిన పరిశోధనలతో డూడుల్‌ తయారుచేసి అంజలి ఘటించింది.

హర్ గోబింద్ ఖురానా 1922 జనవరి 9న పంజాబ్‌లోని రాయ్‌పూర్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణదేవి ఖురానా, గణపత్‌ రాయ్‌. వీరికి ఉన్న ఐదుగురు సంతానంలో ఖురానా చిన్నవారు. 1945లో లాహోర్‌లోని పంజాబ్ యూనివర్శిటీ నుంచి ఖురానా డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1952లో కెనడాకు వెళ్లారు. అక్కడ 1952-60 మధ్య యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబయాలో అధ్యాపకుడిగా చేశారు. అప్పుడే న్యూక్లిక్‌ యాసిడ్‌పై పరిశోధనలు ప్రారంభించారు. డీఎన్‌ఏ, ఆర్ఎన్‌ఏలపై విస్రృత పరిశోధనలు చేశారు.

న్యూక్లిక్‌ యాసిడ్స్‌లో న్యూక్లియోటైడ్స్‌ క్రమాన్ని కనిపెట్టినందుకు గానూ.. 1968లో వైద్య రంగంలో ఆయనకు నోబెల్‌ బహుమతి లభించింది. అదే పరిశోధనకు గాను ఖురానాతో పాటు రాబర్ట్ డబ్ల్యూ.హొల్లీ, మార్షల్ డబ్ల్యూ.నిరెన్‌బెర్గ్‌ నోబెల్ బహుమతి అందుకున్నారు. 1966లో ఖురానా అమెరికా పౌరసత్వం పొందారు. 2011 నవంబర్‌ 9న 89ఏళ్ల వయసులో ఖురానా కన్నుమూశారు.