బంగారానికి రికార్డు ధర!

22 July, 2019 - 10:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారతీయులు మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో ఇష్టపడే బంగారానికి సోమవారం రికార్డు ధర పలికింది. పది గ్రాముల మేలిమి బంగారానికి సోమవారం ఒక్కరోజులో వంద రూపాయలు పెరగడంతో రూ.35,970 వద్ద ట్రేడయింది. భారతదేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ఇంత గరిష్ట స్థాయికి ఏనాడూ చేరలేదు. 10 గ్రాముల బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఎప్పుడూ లేదని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక.. వెండి అయితే.. కిలో రూ.41,960 పలుకుతోంది. గత వారంతో పోలిస్తే వెండి ధర రూ.260 పెరిగింది. పరిశ్రమలు, నాణేల తయారీదారులు వెండి కొనుగోలుకు మొగ్గుచూపుతుండడంతో వెండి ధర పెరిగినట్టు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. స్థానిక నగల తయారీదారుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడంతో పాటు, ఈక్విటీ మార్కెట్లలో పతనం కూడా బంగారం ధర పెరగడానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.