రూ.33 వేల దిగువకు బంగారం ధర

12 January, 2019 - 5:36 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: బంగారం ధర శనివారం రూ.33 వేల దిగువకు వచ్చింది. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.155 తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.32,875కి చేరింది. దీంతో బంగారం ధర పరుగుకు బ్రేక్‌ పడినట్లయింది.

కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలకు తోడు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పుత్తడి ధర తగ్గినట్లు బంగారం వ్యాపారులు వెల్లడించారు.

ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలోకు రూ.600 తగ్గడంతో వెండి ధర కూడా రూ.40 వేల మార్క్‌ దిగువకు వచ్చింది. దీంతో కిలో వెండి రూ.39,850గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర భారీగా తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు.

మరో పక్కన అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు 1,287.80 డాలర్లు పలుకుతోంది.