బంగారం ధర హైజంప్!

11 July, 2019 - 9:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: రెండు రోజుల క్రితమే రూ.600  తగ్గి మురిపించిన బంగారం ధరలు గురువారం రికార్డు స్థాయిలో హైజంప్ చేశాయి. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.930 పెరిగిపోయింది. దీంతో బులియన్‌ వర్గాలు, కొనుగోలుదారులకు షాక్‌ తగిలినట్లయింది. వెండి ధరలు కూడా బంగారం బాటే పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.35,800 పలికింది. 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,630 గా ఉంది. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.100 పెరిగి రూ.27,400గా నమోదైంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.36,290 పకలగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.33,270 వద్ద ఉంది. వెండి ధర కేజీకి రూ.300 పెరిగి రూ.39,200గా ఉంది. మార్కెట్‌లో 100 వెండి నాణాల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82 వేలు.  అంతర్జాతీయంగా మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర  0.3 శాతం పెరిగి 1,423 డాలర్లుగా ఉంది. మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.24 డాలర్లు ఉంది.

ఫెడ్‌ వడ్డీరేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సూచనప్రాయంగా అందించిన సంకేతాలకు  తోడు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించారని బులియన్‌ వర్గాల అంచనా. అటు డాలరు మారకంలో రుపీ కూడా 11 వారాల గరిష్టం వద్ద బలంగానే ముగిసింది. నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ చెప్పిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు 266 పాయింట్లు ఎగిసి పాజిటివ్‌గా క్లోజయ్యాయి.