డేటింగ్ కోసం యువతులు తహతహ!

06 June, 2018 - 1:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఓస్లో (నార్వే): డేటింగ్ అంటే గతంలో అంతగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు డేటింగ్, సహజీవనం అనేవి ఈ ఆధునిక సమాజంలో సర్వసాధారణం అయిపోయాయి. నిజానికి డేటింగ్ కోసం అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా తహతహలాడుతున్నారట. నార్వే కేంద్రంగా నడుస్తున్న నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు డేటింగ్ ట్రెండ్స్‌పై పరిశోధన చేస్తూ, 10 నుంచి 29 సంవత్సరాల వయసులోని అమ్మాయిలను, అబ్బాయిలను ఆరా తీసి ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

డేటింగ్ కోసం షార్ట్ కట్స్ కావాలని యువత కోరుకుంటోందని, వీరికి అందుబాటులో ఉన్న ‘టిండర్’ అనే యాప్ హాట్ ఫేవరెట్ అని ప్రొఫెసర్లు తేల్చారు. ‘టిండర్’ ను అమ్మాయిలే అధికంగా వాడుతున్నారని, అయితే, అబ్బాయిల వ్యక్తిగత వివరాలు, వృత్తి నేపథ్యాలను పరిశీలించిన తరువాతే వారు డేటింగ్ విషయంలో ఓ నిర్ణయానికి వస్తున్నారని వెల్లడించారు. ఆ తరువాత తాము తీసుకున్న నిర్ణయం ఎటువంటిదైనా అమ్మాయిలు కట్టుబడే ఉంటున్నారని తెలిపారు.

అయితే.. అబ్బాయిల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని, ఒకేసారి ఎక్కువ మంది అమ్మాయిలను పరిచయం చేసేసుకుంటున్నారని, వారిని ఎప్పుడు కలవాలా? అనే ఆరాటం వారిలో ఎక్కువగా ఉందని నార్వేజియన్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు తమ అధ్యయనంలో తేల్చారు.

షార్ట్ టర్మ్ రిలేషన్‌షిప్, లైంగిక కోరికలు తీర్చుకునేందుకే ఈ యాప్‌ను అత్యధికులు ఆశ్రయిస్తున్నారని ప్రొఫెసర్ల అధ్యయనంలో తేలింది. ఒకరు నచ్చకపోతే వెంటనే మరొకరికి ప్రపోజ్ చేసే విషయంలో కూడా అబ్బాయిలే ముందుంటున్నారట.

కానీ.. అతి కొద్ది మంది మాత్రం తమకు నచ్చే అమ్మాయి దొరికే వరకూ నిరీక్షిస్తున్నారని, వీరిలో కొందరు మనసుకు నచ్చిన వారితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని కూడా ప్రొఫెసర్లు తెలిపారు.