ప్రొఫెసర్‌ను చితక్కొట్టిన విద్యార్థినులు

07 May, 2018 - 1:43 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పాటియాలా (పంజాబ్): విద్యార్థినుల మొబైల్ ఫోన్లకు అసభ్యకర సందేశాలు పంపిన ఓ ప్రొఫెసర్‌‌కు దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పారు కళాశాల విద్యార్థినులు. ఆ ప్రొఫెసర్‌‌ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ ఘటన పంజాబ్‌‌లోని పాటియాలా ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగింది. పాటియాలాలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్‌ అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు పంపాడు.

దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయిలు ఆ ప్రొఫెసర్‌‌పై దాడి చేశారు. కళాశాల నుంచి అతడిని బయటకు లాక్కొచ్చి ఎడాపెడా వాయించారు. ఇదంతా ఓ విద్యార్థిని వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అయింది.

కాగా.. ఆ ప్రొఫెసర్‌ పేరు ఇంత వరకూ బయటకు వెల్లడించలేదు. బాధితులు పోలీసులను సంప్రదించారో లేదో అనే విషయంలో స్పష్టత లేదు.

ఎనిమిది మంది జేఎన్‌‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్ అతుల్ జోహారీ ఉదంతం మర్చిపోక ముందే కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం.