వరల్డ్ కప్ కామెంటరీ ప్యానల్‌లో దాదా

11 January, 2018 - 3:30 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

దుబాయ్‌: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌ టోర్నీకి కామెంటేటర్‌‌‌లుగా బాధ్యత నిర్వహించేందుకు భారత్ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీతో పాటు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రాలను ఐసీసీ కామెంటేటర్‌లుగా ఎంపిక చేసింది. ఈ మేరకు క్రికెట్ వరల్డ్ కప్‌ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.న్యూజిలాండ్‌ వేదికగా ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు అండర్‌-19 వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి కామెంటేటర్‌ బాధ్యతలు నిర్వహించేందుకు 14మందితో కూడిన జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఈ కామెంటరీ ప్యానెల్‌లో దాదా, అంజుమ్‌ చోప్రాతో పాటు టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా), ఇయాన్‌ బిషప్‌ (వెస్టిండీస్‌), సైమన్‌ డౌల్‌ (న్యూజిలాండ్‌), డానీ మారిసన్‌ (న్యూజిలాండ్‌), హెచ్‌డీ అకర్మన్‌ (దక్షిణాఫ్రికా), రాబ్‌ కీ (ఇంగ్లాండ్‌), నిక్‌ నైట్‌ (ఇంగ్లాండ్‌), మార్క్‌ బుచర్‌ (ఇంగ్లాండ్‌), గ్రాంట్‌ ఇలియాట్‌ (న్యూజిలాండ్‌), క్రిస్‌ హారిస్‌ (న్యూజిలాండ్‌), రసూల్‌ ఆర్నాల్డ్‌ (శ్రీలంక), అలాన్‌ విలకిన్స్‌ (ఇంగ్లాండ్‌) చోటు దక్కించుకున్నారు.

ఈ టోర్నీలో భారత జట్టు పృథ్వీ షా సారథ్యంలో బరిలోకి దిగనుంది. రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.