కిడ్నాప్ ముఠా గుట్టు రట్టు

25 April, 2019 - 6:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: పాతబస్తీలో చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టును చంద్రాయణగుట్ట పోలీసులు గురువారం రట్టు చేశారు. ముఠాలోని ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 35 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని.. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించారు. అలాగే వారి వద్ద ఉన్న ముగ్గురు చిన్నారులను రక్షించి.. వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

అనంతరం పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఇంటి ఎదుట ఆడుకునే పిల్లలే ఈ కిడ్నాపర్లు టార్గెట్‌గా చేస్తుకున్నారని వివరించారు. అలా తీసుకువెళ్లిన చిన్నారులను ఈ ముఠా… పిల్లలు లేని వారికి రూ. 2.5 లక్షలు నుంచి రూ. 3.10 లక్షలకు విక్రయిస్తున్నారని వివరించారు. గతంలో వీరు ఎత్తుకెళ్లిన వారిలో నవజాత శిశువులు కూడా ఉన్నారని తమ విచారణలో తెలిందన్నారు. ఈ ముఠాలో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారని… అయితే వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు తీవ్ర తరం చేసినట్లు చెప్పారు.

అయితే ఈ ముఠా చెరలో ఇంకా ఎంత మంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. చిన్నారుల అదృశ్యంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ కమ్రంలో సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.