మిర్చి.. మిర్చి.. మిర్చి లాంటి కుర్రోడే!

28 April, 2018 - 2:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఏపీ టీడీపీ లోక్‌‌సభ ఎంపీల్లో ఒకరిద్దరు ఏం మాట్లడినా.. ఏం చేసినా.. అంతా వెరైటీనే. ఇంకా విపులంగా చెప్పాలంటే జేసీ దివాకర్ రెడ్డి, ఎన్. శివప్రసాద్. వీరిద్దరూ ‘వేషభాషలందు వేరయా’ చందంగా ఉంటారు. మిగిలిన టీడీపీ ఎంపీలంతా కామ్! రాష్ట్రంలో ఏదైనా సమస్య తెరపైకి వస్తే మాత్రం ఒకరిద్దరు ఎంపీలు మీడియా ముందుకు ఇలా వచ్చి అలా మాయం అవుతారు.Galla Jayadev

ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీల్లో గల్లా జయదేవ్ పేరు తాజాగా హాట్ టాపిక్‌‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా అంశంపై ఇటీవల లోక్‌‌సభలో జయదేవ్ ప్రసంగానికి ఐదు కోట్ల ఆంధ్రులు ముగ్దులయ్యారంటే అతిశయోక్తి కాదేమో. దాదాపు పావు గంట పాటు సాగిన జయదేవ్ ప్రసంగంలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అంటూ మోదీ, జైట్లీని సంబోధించడమే కాకుండా… ఏపీ ప్రజలు ఫూల్స్ కాదని వాళ్లకు బల్లగుద్ది మరీ చెప్పారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు.. బాహుబలి కలెక్షన్ల కంటే తక్కువ ఉన్నాయంటూ చమత్కరించారు.

ఈ ఒక్క స్పీచ్‌తో జయదేవ్ అమాంతంగా హీరో అయిపోయారు. దీంతో ఢిల్లీ నుంచి గుంటూరు వచ్చిన ఆయనకి ప్రకాశం బ్యారేజి నుంచి ప్రజలు బ్రహ్మరథం పట్టి.. ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఇప్పటికే కృష్ణాజిల్లాలోని ఇద్దరు లోక్‌‌సభ సభ్యులు గల్లాపై కొంత గుర్రుగా ఉన్నట్లు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. గల్లా ప్రసంగానికే ఇంత హడావుడా అంటూ ఆ ఎంపీలు పేర్కొన్నట్లు అమరావతిలో కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది.

చిత్తూరు జిల్లాలోని బిజినెస్ కమ్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా జయదేవ్ ఇప్పటి వరకు సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగానే తెలుసు. కానీ లోక్‌భలో మొన్నటి ప్రసంగంతో ఆయనలోనూ పస ఉందని అందరికీ అర్థమైంది. అంతేకాక లోక్‌‌సభలో తన ప్రసంగానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన జయదేవ్‌‌లో మాంచీ ఊపు, ఉత్సాహాన్ని నింపిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని జయదేవ్ ట్విట్టర్ వేదికగా చేస్తున్న కామెంట్లపై సర్వత్రా చర్చ సాగుతోంది. ‘మోదీ- షా ప్రొటెక్షన్‌‌లో జగన్, పవన్ సినిమా త్వరలో విడదల కాబోతోంది. ఈ సినిమాకి ప్రశాంత్ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు’ అంటూ జయదేవ్ పేర్కొన్నారు.

మళ్లీ ఎన్నికల సీజన్ వస్తోంది. ఎంపీగా రెండోసారి కూడా చాన్స్ దక్కించుకోవాలనే ఉబలాటంలో జయదేవ్ ఉన్నారంటూ గుంటూరులోని టీడీపీ తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి సోదరి రమాదేవి చేత సైకిల్ గుర్తుపై పోటీ చేయించేందుకు ఇప్పటికే జయదేవ్ రంగం సిద్ధం చేశారట. అందుకోసం చంద్రబాబుతో మంతనాలు కూడా పూర్తయినట్లు మంగళగిరిలో హాట్‌‌హట్‌‌గా టాపిక్ వైరల్ అవుతోంది.

2014 ఎన్నికల్లో బిజినెస్ నుంచి పాలిటిక్స్‌కి జయదువ్ ఎంటరయ్యారు. మరి ఈ నాలుగేళ్లలో ఎంతో కొంత రాజకీయం నేర్చుకోకుంటే.. అయిదు కోట్ల ఆంధ్రుల కోసం కాకున్నా నియోజకవర్గ ప్రజలకైనా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి ఉండాలిగా. అందుకే ఈ తాపత్రయం అని ఆయన అంటే పడనివాళ్లు పేర్కొంటున్నారు. ఎన్నికలు సమిపిస్తున్న నేపథ్యంలో ఈ మాత్రం గుంటూరు మిర్చి ఘాటైనా ప్రధానికి అంటకపోతే… ఇక విలువేం ఉంటుందని కొందరు సెటైర్లు వేస్తున్నారు.