పరారీలో గాలి జనార్దన్ రెడ్డి

07 November, 2018 - 3:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీని చీటింగ్ చేసిన కేసులో ఆయన చిక్కుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ నుంచి కాపాడతానంటూ గాలి ఆ సంస్థ నుంచి భారీ మొత్తాన్ని స్వీకరించారు.

ఈ వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు బయలుదేరడంతో ఈ మాజీ మంత్రి అదృశ్యమయ్యారు. అయితే.. గాలి జనార్దన్‌రెడ్డి ఆయన అనుచరుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతలోనే వాళ్ళ ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో సీసీబీ డీసీపీ గిరీశ్‌ నేతృత్వంలోని పోలీసుల బృందం గాలి జనార్ధన్‌రెడ్డి కోసం ఆచూకీ కోసం తెలంగాణలో గాలిస్తోంది.

చీటింగ్ కేసులో తనను అరెస్ట్ చేస్తారని ముందుగానే పసిగట్టిన గాలి జనార్దన్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నారు. ఇదే కేసులో ఆయనకు సహకరించిన ఆలీఖాన్ అనే వ్యక్తికి బెంగళూరులో బెయిల్ లభించింది.

అంబిడెంట్ అనే సంస్థ రూ.500 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు 2014లో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి సీసీబీ, ఈడీ అధికారులు ఆ సంస్థ చైర్మన్ ఫారిద్‌ను విచారిస్తూ వచ్చారు. అయితే ఈ కేసు నుంచి ఫారిద్‌ను తప్పించేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి డీల్ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ డీల్ నిమిత్తం అంబిడెంట్ కంపెనీ నుంచి బళ్లారికి చెందిన రాజ్మాహల్ జ్యుయెల్లర్‌కు రూ.18.5 కోట్ల విలువైన 57 కేజీల బంగారు కడ్డీలతో పాటు రూ.2 కోట్ల నగదు ముట్టజెప్పినట్లు సీసీబీ పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం లావాదేవీల్లో అంబిడెంట్‌తో పాటు బెంగళూరుకు చెందిన అంబికా జ్యుయెల్లర్స్‌, జనార్దన్‌రెడ్డికి చెందిన ఎనేబుల్ ఇండియా సంస్థలు కూడా భాగస్వాములని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి గాలి జనార్ధన్‌రెడ్డి ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది.

బెంగళూరు, బళ్లారి, హైదరాబాద్, ఢిల్లీ సహా పలుచోట్ల గాలి జనార్దన్‌రెడ్డి నివాసాలు, ఆఫీసులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల గురించి ముందే తెలుసుకున్న గాలి అక్కడి నుంచి పరారయ్యారు. లంచం విషయంలో గాలిని త్వరలోనే ప్రశ్నిస్తామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చిన వ్యవహారంలో గాలి జనార్దన్‌రెడ్డికి నోటీసులు జారీచేసినట్లు వెల్లడించారు.