గజ్వేల్‌ నుంచి పోటీ: గద్దర్

08 November, 2018 - 5:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: ఓటు అనేది రాష్ట్ర రాజకీయ నిర్మాణానికి రూపమని ప్రజా గాయకుడు గద్దర్ అభివర్ణించారు. ఓట్ల విప్లవం వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఓటర్లను చైతన్య పరిచేందుకు నవంబర్ 15 నుంచి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తానని ఆయన తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను ఆయన కలిసి చర్చించారు. పల్లెపల్లెకు తిరిగి ఓటు ఆవశ్యకతను వివరిస్తానని గద్దర్ స్పష్టం చేశారు.

తనకు ఓటుహక్కు వచ్చిందని, గజ్వేల్‌లో స్వతంత్రంగా పోటీ చేస్తానని గద్దర్‌ పేర్కొన్నారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదన్నారు. దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాతో భేటీ అయిన దాదాపు 45 నిమిషాల పాటు అన్ని అంశాలపై చర్చించానన్నారు. సీఐడీ అదనపు డీజీని కలిసి భద్రత కల్పించాలని కోరినట్లు గద్దర్‌ ఈ సందర్భంగా తెలిపారు. అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా అపాయమని.. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు ఎవరు రక్తం చిందిస్తారో వాళ్లే చిరస్మరణీయంగా ఉంటారని గద్దర్ పేర్కొన్నారు.