ఫంక్షన్‌హాల్ గోడ కూలి నలుగురు దుర్మరణం

10 November, 2019 - 10:21 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: ఆదివారం మధ్యాహ్నం ఊహించని విషాదకర సంఘటన జరిగింది. శిథిలావస్థకు చేరిన ఓ ఫంక్షన్‌హాల్‌కు ఆధునిక హంగులు అద్దుతున్న నిర్వాహకులు దాని మధ్యలో ఓ భారీ గోడ నిర్మించారు. పునాది, బీమ్‌ లేకుండా నిర్మించిన ఆ గోడ ఆదివారం హఠాత్తుగా కుప్ప కూలిపోయింది. అదే సమయంలో ఓ వివాహ వేడుక జరుగుతుండటంతో తీవ్ర కలకలం రేగింది. గోడ శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులైన మరో ముగ్గురు ఉస్మానియా ఆస్పత్రిలో పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరికొందరికి గాయాలు తగలగా.. ఆటో సహా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ విషాదకర ఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని గోల్నాకలో చోటుచేసుకుంది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాచిగూడకు చెందిన హర్షద్‌హడ్డ గోల్నాకలో పెరల్‌ గార్డెన్‌ పేరిట ఫంక్షన్‌హాల్‌ నిర్వహిస్తున్నాడు. నల్లకుంట నర్సింహబస్తీకి చెందిన కొండూరు సదానందం, లలిత దంపతుల నాల్గో కుమార్తె స్వప్నను మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం యాన్మగండ్లకు చెందిన జంగయ్య, అంజమ్మ కుమారుడు చంద్రశేఖర్‌తో  ఆదివారం మధ్యాహ్నం 11.49 గంటలకు పెళ్లి మూహూర్తం కుదిరింది. వీరి వివాహం నిర్వహించేందుకు గోల్నాకలో ఉన్న పెరల్‌ గార్డెన్‌ను బుక్‌ చేశారు. వధూవరులతో పాటు బందువులంతా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వివాహం జరిగి తలంబ్రాల తంతు ముగుస్తుండగా బంధువులు భోజనాలకు బయలుదేరారు.వధూవరుల వేదిక వైపు ఉన్న భారీ గోడ పెద్ద శబ్దంతో బయటకు పడిపోయింది. అప్పుడే  పెళ్లికి వచ్చిన కొందరు లోపలికి వెళ్తుండగా మరికొంత మంది వేదిక గోడ వద్ద వేచి చూస్తున్నారు. భారీ గోడ కుప్పకూలి వారిపై పడింది. అక్కడే ఉన్న నర్సింహ బస్తీకి చెందిన విజయలక్ష్మి (60), కర్మన్‌ఘాట్‌కు చెందిన రాజు కుమారుడు  సురేష్‌ (28), అంబర్‌పేటకు చెందిన ఖాజా కుమారుడు సోహెల్‌ (35) మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకొండకు చెందిన వెంకటయ్య కుమారుడు కృష్ణ (40) మృతి చెందారు. అంబర్‌పేటకు చెందిన మాజిద్, వెంకటేష్‌ స్వల్పంగా గాయపడ్డారు.

ఒక్కసారిగా భారీ గోడ కూలడంతో వివాహ వేడుకల్లో కలకలం రేగింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే గోడ శిథిలాల క్రింద పడి ఉన్నారు. వెంటనే స్థానికులు, పోలీసులు, పెండ్లి వేడుకలకు హాజరైనవారు శిథిలాల కింద ఉన్న వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పెరల్‌ గార్డెన్‌ యాజమాని తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గోడ నిర్మాణానికి కనీసం పిల్లర్, పునాది కూడ తీయకుండా చెక్కలు పెట్టినట్లు నిర్మించాడం ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు.గత 45 రోజుల క్రితమే తాను పెరల్‌ గార్డెన్‌కు వచ్చినప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయని, మీ పెళ్ళి నాటికి మరమ్మతులు పూర్తిచేసి అందిస్తానని చెప్పడంతో బుక్‌ చేసుకున్నామని పెళ్ళి కుమార్తె తండ్రి చెప్పాడు. డబ్బులు కూడా చెల్లించామని, ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. నిజానికి పెళ్ళి తంతు జరుగుతున్నప్పుడైతే మృతుల సంఖ్య మరింతగా పెరిగి ఉండేదని భయపడ్డాడు. అప్పుడే అంతా భోజనాలకు బయలు దేరారని, ఆ సమయంలో గోడ కూలిందని, లేదంటే మరింత ప్రాణనష్టం జరిగేదని అన్నాడు. ఫంక్షన్‌ హాల్‌కు మధ్యలో ప్రమాదానికి కారణమైన గోడ ఉండడమే ఇలా ప్రాణ నష్టానికి కారణమైందంటున్నాడు.

ప్రమాదం గురించి తెలుసుకున్న ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్, ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో బందోబసు ఏర్పాటు చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు. మరో పక్కన సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల క్రింద ధ్వంసమైన వాహనాలను బయటకి తీశారు. పడిపోయిన గోడ శిథిలాలను జేసీబీ వాహనంతో పక్కకు తొలగించారు. మృతుల కుటుంబాలకు జీహెచ్ఎంసీ రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.