నలుగురు న్యాయమూర్తులపై ఎవరేమన్నారంటే…

12 January, 2018 - 5:07 PM

                                                            (న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పరిస్థితి సజావుగా లేదంటూ, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందు వెల్లడించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయమూర్తుల తిరుగుబాటుపై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విష‌యంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. దేశ ప్ర‌జాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పును ఈ ప‌రిణామాలు ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని తెలిపింది. సుప్రీంకోర్టు ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో ప‌రిస్థితుల‌ను త‌క్ష‌ణం స‌రిదిద్దాల‌ని, లేక‌పోతే దేశ ప్ర‌జ‌ల‌కు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం స‌న్న‌గిల్లే ప్ర‌మాదం ఉంద‌ని త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంది.


జస్టిస్ ఆర్ఎస్ సోధీ మాట్లాడుతూ.. ఆ నలుగురు న్యాయమూర్తులు అపరిపక్వత కనబరిచారని విమర్శించారు. చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్ చిన్న పిల్లల మాదిరిగా వ్యవహరించారని చురకలంటించారు. వారిని వెంటనే అంభిశంసించాలన్నారు. ఇటువంటి ట్రేడ్ యూనియనిజం చాలా తప్పు అని అన్నారు.


బీజేపీ నేత సుబ్రహ్మణియన్ స్వామి స్పందిస్తూ ఆ నలుగురు న్యాయమూర్తులను విమర్శించలేమన్నారు. వారు గొప్ప నిజాయతీ, చిత్తశుద్ధిగలవారన్నారు. వారి లీగల్ కెరీర్‌లో చాలా భాగాన్ని త్యాగం చేశారన్నారు. ఆ సమయంలో వారు కావాలనుకుంటే న్యాయవాదులుగా చాలా సొమ్ము సంపాదించి ఉండేవారన్నారు. మనం వారిని గౌరవించాలన్నారు. ఆ నలుగురు జడ్జీలు, సీజేఐ, వాస్తవానికి మొత్తం సుప్రీంకోర్టు ఏకాభిప్రాయానికి వచ్చి, తదుపరి కార్యకలాపాలు సజావుగా నడిచేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవ చూపాలన్నారు.


సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ఇది చాలా తీవ్ర పరిణామమన్నారు. దీనివల్ల సీజేఐపై పెద్ద నీడ కమ్మిందన్నారు. సీజేఐ తన అధికారాలను దారుణంగా దుర్వినియోగం చేస్తున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితులు తప్పవని, అందుకే మునుపెన్నడూ లేని విధంగా ఈ పరిణామం సంభవించిందని చెప్పారు.


కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలచివేసినట్లు తెలిపారు. జడ్జిలు మీడియాతో మాట్లాడవలసిన ఒత్తిడి సుప్రీంకోర్టుపై రావడం ఆందోళనకరమన్నారు.

సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకు ఇదొక చీకటి రోజు అని ఆరోపించారు. నేటి ప్రెస్ కాన్ఫరెన్స్ చెడు దృష్టాంతంగా నిలుస్తుందన్నారు. నేటి నుంచి ప్రతి సామాన్యుడూ ప్రతి తీర్పునూ అనుమానంతో చూస్తాడన్నారు. ప్రతి తీర్పును ప్రశ్నిస్తారన్నారు.