లారీని ఢీకొన్న బస్సు.. ఆరుగురి మృతి

01 October, 2017 - 9:16 AM


(న్యూవేవ్స్ డెస్క్)

సూర్యపేట: సూర్యపేట జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామ సమీపంలో ఆగివున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మునగాల సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆగివున్న లారీని ఢీకొట్టింది. లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్ లారీ కిందకు దూరి టైరు విప్పుతున్నాడు. దానిని దాటి వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. ఒక పక్క బస్సు భాగం మొత్తం లారీని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో బస్సు సగభాగం ధ్వంసమైంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. లారీ కింద చిక్కుకున్న లారీ డ్రైవర్ ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సూర్యపేట, కోదాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మృతిచెందిన వారిలో లారీడ్రైవర్‌ ఏడుకొండలు(48), సూర్యాపేటకు చెందిన రాణి(47) , కోదాడకు చెందిన సత్తయ్యా, అవనిగడ్డకు చెందిన మాతంగి వరప్రసాద్‌(60), కుటుంబరావు, ఎం.ఎం. ప్రసాద్‌లు ఉన్నారు. గాయపడిన వారిలో కృష్ణాజిల్లా కోసూరుకు చెందిన మునగాల రమాదేవి, పెద్దకూడి సుబ్బారావు, ఖమ్మం జిల్లా తల్లడ మండలానికి చెందిన రాణి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.