‘బాబు దెబ్బకు పారిపోయింది’

14 February, 2019 - 4:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయనగరం: కోడికత్తి పార్టీకి విశ్వసనీయత లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కోడికత్తి కేసులో టీడీపీపై బురద చల్లాలని చూశారని కానీ ఆ బురద మీ మీదే పడుతుందని అన్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నా బొత్స సత్తిబాబు అలియాస్ సత్యనారాయణ దెబ్బకు వోక్స్ వ్యాగన్ కంపెనీ పారిపోయిందని ఎద్దేవా చేశారు.

గురువారం విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనతరం చంద్రబాబు మాట్లాడుతూ… ప్రధాని మోదీ.. నాలుగేళ్లపాటు నమ్మించి ఏపీని మోసం చేశారని ఆరోపించారు. మోదీ , జగన్ ఏం చదివారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. చదువు వల్ల సంస్కారం, తెలివితేటలు వస్తాయన్నారు. చదువులేని వాళ్లు మాటలే చెబుతారు, నట్టేట ముంచుతారని చంద్రబాబు చమత్కరించారు.

పెళ్లి చేసుకుని భార్యను గౌరవించని సంస్కారం ప్రధాని మోదీదీ అని ఆరోపించారు. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత వైయస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కలసి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సాయం చేయక పోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రధాని మోదీకి బాధగా ఉందన్నారు.

అలాగే తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పారు. విభజనతో ఏర్పడిన కష్టాల్లోనూ ఎలా ముందుకెళ్తున్నారనేదే తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ అని ఆరోపించారు. కడప జిల్లాలోని పులివెందులకు కూడా నీరిచ్చాం .. అదే వైయస్ జగన్ బాధ అని విమర్శించాు. అభివృద్ధి అంటేనే వైయస్ జగన్‌కు అస్సలు ఇష్టం ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. నమ్మక ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలనే కూటమి కట్టామని స్పష్టం చేశారు.

అలాగే టీడీపీనీ విడి ఫ్యాన్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే ఆమంచి, ఎంపీ అవంతి శ్రీనివాస్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ… స్వార్థంతో పార్టీలు మారే నేతలకు భయపడేదే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలు మారే వారికి బుద్ధి చెప్పాలంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. అదేవిధంగా లోకేశ్ తండ్రిగా తాను గర్వపడుతున్నానన్నారు.

లోకేశ్ రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలు తెచ్చాడని గుర్తు చేశారు. విజయనగరం జిల్లా అభివృద్ధిని నేను తీసుకుంటానని.. టీడీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలంటూ ప్రజలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు అండగా ఉండాలన్నారు. 25 ఎంపీ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భోగాపురం విమానాశ్రయం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. విడిభాగాల తయారీ కేంద్రం కూడా విజయనగరానికి వస్తుంది… అలాగే తయారీ కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి పెరుగుతుందన్నారు. 2700 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి చేస్తామన్నారు. ఇచ్ఛాపురం – భోగాపురం, భోగాపురం- విశాఖ మధ్య బీచ్ రోడ్ అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేవి.. కానీ తమ పరిపాలనలో పింఛన్లు పారదర్శకంగా ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు.