బాగా క్షీణించిన మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం?

13 June, 2018 - 11:10 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ఆరోగ్యం మరింత విషమంగా మారింది. శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న ఆయనను సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో చేర్చిన విషయం తెలిసిందే. వాజపేయికి యాంటీ బయోటిక్స్ అందిస్తున్నామని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని మంగళవారం ఉదయం ఎయిమ్స్‌ మీడియా అధికారి ఆరతీ విజ్‌ బులెటిన్‌ విడుదల చేశారు. వాజపేయి ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌‌దీప్‌ గులేరా పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొన్నారు.

అయితే.. మంగళవారం సాయంత్రం ఆస్పత్రి వర్గాలు వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయలేదు. వాజపేయికి ఉన్న ఒకే ఒక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అశ్విన్‌ కుమార్‌ చౌబే, సాధ్వీ నిరంజన్‌ జోషి, అనంత్‌ గీతే, మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి మంగళవారం ఎయిమ్స్‌‌కు వచ్చి వాజపేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాజపేయి ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు గానకోకిల లతా మంగేష్కర్‌ ట్వీట్‌ చేశారు.