వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే..!

15 March, 2019 - 4:08 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పులివెందుల (కడప జిల్లా): మాజీ మంత్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. వివేకా శరీరం మీద పదునైన ఆయుధంతో ఏడు సార్లు దాడి చేసినట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు గుర్తించారు. వివేకా నుదుటిపైన లోతైన రెండు గాయాలు, తల వెనుక మరో గాయం, తొడ భాగంలో, చేతిపైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వివేకానందరెడ్డిని హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అనుమానాస్పద స్థితిలో శుక్రవారం ఉదయం వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిచెందారు. ఆయన భౌతికకాయానికి పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌‌‌మార్టం పూర్తయింది. పోస్ట్‌‌మార్టం పూర్తిచేసిన వైద్యులు.. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వివేకానందరెడ్డి భౌతికకాయన్ని స్వగృహానికి తరలించారు. మరోవైపు వివేకానందరెడ్డి నివాసానికి బంధువులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తలపై గాయం ఉండటం, చనిపోయిన సమయంలో వివేకానందరెడ్డి ఒంటరిగా ఉండటం, దొడ్డివైపు తలుపు తెరిచి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులకు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదిక కీలకంగా మారింది.