వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతి

15 March, 2019 - 10:45 AM

  (న్యూవేవ్స్ డెస్క్)

పులివెందుల (కడప జిల్లా): దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (68) శుక్రవారం తెల్లవారు జామున గుండెపోటుతో పులివెందులలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వివేకానందకుకు భార్య సౌభాగ్య, కుమార్తె సునీత ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి సౌమ్యుడిగా పేరు పొందారు. తనకు సహాయం చేయమని అడిగిన వారి కోసం ఎంతవరకైనా వెళ్లేవారు. రాజకీయాల్లో వైఎస్సార్‌‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో వివేకా డిగ్రీ చదివారు. 1989,1994లలో పులివెందుల నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004 లలో కడప పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో వ్యయసాయ మంత్రిగా పనిచేశారు. వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది.

వైఎస్ వివేకానందరెడ్డి మరణవార్త తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ హుటాహుటిన పులివెందులకు బయలుదేరారు.

కాగా.. పులివెందులలోని తన ఇంటి బాత్‌రూమ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా కనిపించగా, ఆయన మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 175 కింద అనుమానాస్పద మ‌ృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని చెప్పిన కృష్ణారెడ్డి తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. పోస్టుమార్టం కోసం వివేకా మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కేసు విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాన్ని పరిశీలిస్తామని కడప ఎస్పీ వెల్లడించారు.గురువారం అంతా ప్రజల మధ్య ఉత్సాహంగా కనిపించి, ఇంటికెళ్లి స్నానాల గదిలో విగతజీవిగా కనిపించిన వైఎస్ వివేకా మరణంపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. వివేకా పడి ఉన్న ప్రాంతంలో రక్తపు మరకలు కనిపించడంతో డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు.