‘హెచ్‌సీఏలో అవినీతిపై విచారణ జరపాలి’

13 January, 2018 - 1:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పై భారత మాజీ మాజీ కెప్టెన్‌ అజారుద‍్దీన్‌ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విచారణ జరపాలని అజారుద్దీన్‌ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజారుద‍్దీన్‌ మాట్లాడుతూ హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. లోథా సిఫార్సులను హెచ్‌సీఏ అమలు చేయడం లేదని అన్నారు. హెచ్‌సీఏ పాలకవర్గం హక్కులను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. చదువుకున్న వ్యక్తులు కూడా ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన సూచించారు.

‘హెచ్‌సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోంది. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్‌ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20 లీగ్‌ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్‌కు వివేక్‌ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్‌సీఏ లోగోతో వివేక్‌ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్‌ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇక బీసీసీఐ నుంచి నాకు క్లియరెన్స్‌ రాలేదని ఆరోపించారు. కానీ నాకు హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీనిపై నేను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌ తప్పు చేశారు. చదువుకున్న వ‍్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై నేను చట్టపరంగా ముందుకు వెళతా. నాకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయితే నన్ను ఓ సెలబ్రెటీగా అందరూ ఆహ్వానిస్తారు’ అని అజారుద్దీన్‌ వ్యాఖ్యానించారు.

కేవలం ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండేందుకు తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. బీసీసీఐ నుంచి తనకు అనుమతి లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేకానంద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దగ్గర రాతపూర్వక ఆధారాలు ఉన్నాయని, హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేకానందతో కానీ ఇతర అధికారులపైన కానీ తనకు వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదన్నారు. కానీ ప్రెసిడెంట్ వివేకానంద తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జీ వెంకటస్వామి కప్ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అనుమతి లేదని, కానీ హెచ్‌సీఏ ఆ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నదని అజారుద్దీన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల టోర్నీల కోసం బీసీసీఐ పర్మిషన్ తీసుకుంటే, మన హెచ్‌సీఏ మాత్రం అలా చేయడం లేదని చెప్పారు.

గత ఏడాది జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో తనను పోటీ చేయకుండా ప్రకాశ్ జైన్‌‌తో పాటు హెచ్‌సీఏ అధికారులు అడ్డుకున్నారని మండిపడ్డారు. తనకు అర్హత లేదని రిటర్నింగ్ ఆఫీసర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ అంశంలో తాను న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు అజారుద్దీన్ వెల్లడించారు.

బీసీసీఐ అధికారులైన వినోద్ రాయ్, రాహుల్ జోరీలను కలిసేందుకు తాను ముంబై వెళ్లనున్నట్లు అజారుద్దీన్ వెల్లడించారు. తమ కేసును వ్యక్తిగతంగా బీసీసీఐ ముందు ఉంచాలన్నదే తమ ఉద్దేశమని, దీని పట్ల బీసీసీఐ సరైన చర్య తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాలకు కానీ లోధా సూచనలకు అనుకూలంగా హెచ్‌సీఏ వ్యవహరించడం లేదన్నారు. క్యాబినెట్ మంత్రి హోదా ఉన్న వివేకానంద కూడా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అనర్హుడని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కూడా అజారుద్దీన్ డిమాండ్ చేశారు.