పద్మ అవార్డు అందుకున్న గంభీర్

16 March, 2019 - 2:19 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ పద్మశ్రీ అవార్డుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. గంభీర్‌తో పాటు భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునిల్‌ ఛెత్రి, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, బాస్కెట్‌‌బాల్ క్రీడాకారుడు ప్రశాంతి సింగ్‌ కూడా పద్మశ్రీ అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌‌లో శనివారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌ కోవింద్‌ ప‌ద్మ పురస్కారాల‌ను ప్రదానం చేశారు.2019 పద్మ పురస్కారాలకు మొత్తం 112 మందిని ఎంపిక చేశారు. వీరిలో 47 మందికి ఈ నెల 11న అవార్డులు అందజేయగా మిగిలిన వారికి శనివారం ప్రదానం జరిగింది. ఈ పురస్కారాలను ఈ ఏడాది జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒడిశాకు చెందిన చాయ్‌‌వాలా డి. ప్రకాశ్‌రావు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆయనతో పాటు ప‌ద్మశ్రీ అందుకున్నవారిలో సినీనటుడు మ‌నోజ్ బాజ్‌‌పాయ్, త‌బ‌లా ఆర్టిస్ట్ స‌ప్నా చౌద‌రి, ప‌బ్లిక్ అఫైర్స్‌‌లో హెచ్.ఎస్. ఫూల్కా ఉన్నారు. ప‌ద్మభూష‌ణ్ అందుకున్నవారిలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయ‌ణ్‌, వాణిజ్యవేత్త మ‌హ‌స్య ధ‌ర్మపాల గులాటీ, ప‌ర్వతారోహ‌కురాలు బ‌చేంద్రి పాల్‌ ఉన్నారు.పద్మ అవార్డులు స్వీకరించిన ప్రముఖులు వీరే:
– జానపద గాయని తీజన్‌‌బాయి- పద్మవిభూషణ్‌
– ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌- పద్మభూషణ్‌
– మహాశయ్‌ ధరంపాల్‌ గులాటి- పద్మభూషణ్‌
– పర్వతారోహకురాలు బచేంద్రిపాల్‌ – పద్మభూషణ్‌
– ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌‌పాయ్‌- పద్మశ్రీ
– స్వపన్‌ చౌధురి- పద్మశ్రీ
– భారత ఫుట్‌‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునిల్‌ ఛెత్రి- పద్మశ్రీ
– ఆర్చర్‌ బంబేలాదేవి లైశ్రమ్‌- పద్మశ్రీ
– మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌- పద్మశ్రీ
– హెచ్‌.ఎస్‌. ఫూల్కా- పద్మశ్రీ