ఎన్నికల చండశాసనుడు శేషన్ తుదిశ్వాస

11 November, 2019 - 6:05 AM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: దేశంలో ఎన్నికల సంస్కర్తగా ప్రసిద్ధి చెందిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) తిరునెల్లయ్‌ నారాయణ అయ్యర్‌ శేషన్‌ (టీఎన్ శేషన్ 87) తుదిశ్వాస విడిచారు. వయస్సు పైబడిన కారణంగా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన శేషన్ ఆదివారం రాత్రి చెన్నైలోని సొంత ఇంటిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. తమిళనాడు కేడర్‌కు చెందిన 1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌ 1990–96 సంవత్సరాల మధ్య 10వ సీఈసీగా పనిచేశారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌లోని తిరునెల్లయ్‌లో శేషన్ 1932లో జన్మించారు. పాలక్కాడ్ లో పాఠశాల విద్య, మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాకినాడ జేఎన్‌టీయూలో సీటు వచ్చినా శేషన్‌ మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చదువుకునేందుకే మొగ్గు చూపారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, అక్కడే డిమాన్‌స్ట్రేటర్‌గా మూడేళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే శేషన్ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. అనంతరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్‌ వర్సిటీలో 1968లో ప్రభుత్వ పాలనలో పీజీ చేశారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా తన పదవీ కాలంలో ఎన్నికల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేసిన వ్యక్తిగా శేషన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డును శేషన్ హయాలోంనే ప్రవేశపెట్టారు. అలాగే ఎన్నికల ప్రచార వేళలను కుదించడం, ఎన్నికల వ్యయాన్ని నియంత్రించడం లాంటి సంస్కరణల్ని ఆయనే తీసుకువచ్చారు. సీఈసీకి ముందు 1989లో ఆయన కీలకమైన కేంద్ర కేబినెట్ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా పనిచేశారు. శేషన్ సేవలు అందించారు. ఎన్నికల విధానంలో పారదర్శకత సాధించేందుకు శేషన్ చేసిన కృషికిగాను ఆసియా నోబెల్‌గా భావించే ప్రతిష్టాత్మక రామన్‌ మెగసెసె అవార్డును ఆయన 1996లో అందుకున్నారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయడం ద్వారా ఆయన చండశాసనుడిగా ప్రసిద్ధి పొందారు. తమిళనాడుతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా శేషన్ ఉన్న కాలంలో నలుగురు ప్రధానులు చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డీ దేవెగౌడ మారారు. శేషన్‌ ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా చాలా క్లుప్తంగా మాట్లాడేవారని పేరు. 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణన్‌పై ఆయన పోటీ చేశారు.

శేషన్‌కు 1959లో జయలక్ష్మితో వివాహమైంది. వీరికి సంతానం లేదు. శేషన్‌ మృతికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ శేషన్‌ను లెజెండ్‌ అని శ్లాఘించారు.

డబ్బు, అధికారం ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చిన రోజుల్లో శేషన్ సీఈసీ పగ్గాలు చేపట్టారు. అనేక విప్లవాత్మక చర్యలతో ఎన్నికలు నిర్వహించి ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సంఘానికి గౌరవం తెచ్చిపెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరనేటంత కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళిని శేషన్ అమలు చేశారు. శేషన్ చర్యల కారణంగా రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా కొంత ఇబ్బందులకు గురైంది. ఈ రెండు వర్గాలు కలిసి ఆయనను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి అనుభవాలతో అప్పట్లో కొందరు ఎన్నికల కమిషన్‌ను అల్‌–శేషన్‌ (ఆల్సేషియన్‌) అనే వారంటుంటారు.

ఎన్నికల్లో శేషన్ అరికట్టిన అక్రమాలు..:
– ఓటర్లకు లంచాలివ్వడం, ప్రలోభాలకు గురిచేయడం, మద్యం పంపిణీ
– ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం
– కులం, మతం ప్రాతిపదికన ఓట్లు కోరడం
– ప్రచారానికి ప్రార్థనా స్థలాలను వాడుకోవడం
– అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు వాడటం.