కోడెలకు అస్వస్థత.. అల్లుడి వైద్యం

24 August, 2019 - 7:28 AM

           (న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్‌ నాయకుడు కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆయన నివాసంలోనే ఉన్న అల్లుడు డాక్టర్ మనోహర్ ఆసుపత్రికి తరలించారు. కోడెలకు చాతీలో నొప్పి రావటంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారని పోలీసులు ధ్రువీకరించారు. కోడెలకు ప్రాణాప్రాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

కాగా.. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కోడెల నరసరావుపేట, సత్తెనపల్లిలో పార్టీ నాయకులతో తీరిక లేకుండా గడిపారు. రాత్రి 8 గంటలకు గుంటూరు చేరుకుని తన నివాసంలో కూర్చుని తాజా పరిణామాలపై పార్టీ నాయకులు, న్యాయవాదులతో ఫోన్‌లో చర్చిస్తుండగా ఒక్కసారిగా ఆయనకు చాతీలో నొప్పి వచ్చింది. వెంటనే భద్రతా సిబ్బంది గుర్తించి డాక్టర్ మనోహర్ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. కోడెల శివప్రసాదరావు అల్లుడు డాక్టర్‌ మనోహర్‌ వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స ప్రారంభించారు.

అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్‌ గుంటూరులో ఉన్న కోడెల శివప్రసాదరావుకు చెందిన కార్యాలయంలో ఉందన్న వార్తలను ధ్రువీకరించుకునేందుకు అసెంబ్లీ సిబ్బంది శుక్రవారం సాయంత్రం గుంటూరు వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోడెల కొంత ఆందోళన చెందినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.