ఛెత్రి మాయ.. కెన్యాపై భారత్ విజయం

05 June, 2018 - 10:57 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: భారత ఫుట్‌‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి మరోమారు మాయ చేశాడు. ఛెత్రి మాయతో ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భారత్‌ వరుసగా రెండో విజయంతో ఫైనల్‌ చేరింది. నాలుగు దేశాల ఈ టోర్నీలో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌‌లో భారత్‌ 3–0తో కెన్యాపై జయభేరి మోగించింది. వందో మ్యాచ్‌ ఆడుతున్న భారత కెప్టెన్‌ సునీల్‌ చెత్రికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో అతను తన వందో అంతర్జాతీయ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. భారత జట్టుకు ఎనలేని విజయాన్ని అందించాడు. ఛెత్రి రెండు గోల్స్‌ (68వ, 71వ నిమిషాల్లో) చేయడంతో ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌‌లో భారత్‌ 3-0 తేడాతో కెన్యాను చిత్తుచేసి ఫైనల్లో అడుగుపెట్టింది.

అంతకు ముందు ‘మమ్మల్ని తిట్టండి.. విమర్శించండి.. కానీ మైదానానికి వచ్చి మా ఆటను చూడండి’ అంటూ ఛెత్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కదిలించింది. దీంతో వారంతా తమ తమ అభిమానులు, అనుయాయులను కూడా కదిలించారు. ఈ నేపథ్యంలో భారత్- కెన్యా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు స్టేడియం పూర్తిగా నిండిపోయింది. స్టేడియంలో అభిమానుల కేరింతల మధ్య భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.

ఈ మ్యాచ్ తొలి సగభాగంలో గోల్సు ఏవీ నమోదు కాలేదు. దాని తర్వాత వర్షం పడడంతో మ్యాచ్‌‌కు కొంత అంతరాయం కలిగింది. తిరిగి మ్యాచ్‌ మొదలైన కొంత సేపటికే ‘డి’ ఏరియాలో ఛెత్రిని ప్రత్యర్థి ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ భారత్‌‌కు పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని ఛెత్రి 68వ నిమిషంలో విజయవంతంగా గోల్‌గా మలచడంతో స్టేడియం ఒక్కసారిగా ఛెత్రి ఛెత్రి… కెప్టెన్‌ కెప్టెన్‌ అంటూ స్టేడియం హోరెత్తిపోయింది. ఆ తర్వాత మూడు నిమిషాల్లోపే జేజె లాల్‌‌పెహ్లువా (71వ నిమిషంలో) గోల్‌ చేసి భారత్‌‌కు రెట్టింపు ఆనందాన్ని అందించాడు. కొన్ని నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా ఛెత్రి (92వ నిమిషంలో) గోల్‌ కొట్టాడు.

ఈ మ్యాచ్‌‌‌కు ముందు వందో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న ఛెత్రిని మాజీ కెప్టెన్లు భైచుంగ్‌, విజయన్‌ సన్మానించారు. మైదానంలో అడుగుపెడుతున్న సమయంలో ఛెత్రికి సహచరులు ‘గార్డ్‌ ఆఫ్‌ హానర్‌’ గౌరవాన్ని అందించారు.