ఐదేళ్ళ బాలుడ్ని కరిచి చంపిన కుక్కలు

21 September, 2017 - 9:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: వీధి కుక్కల స్వైర విహారం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఐదేళ్ళ బాలుడ్ని ఆరు వీధికుక్కలు క‌రిచి చంపేశాయి. ఈ దారుణ సంఘ‌ట‌న గుంటూరు నగర శివారులోని అడవితక్కెళ్లపాడులోని రాజీవ్‌ గృహకల్ప వద్ద గురువారం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ప్రేమ్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి, కరిచేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు రోడ్డుపైనే రక్తపు మడుగులో క‌ద‌ల‌లేని స్థితిలో ఏడుస్తూ క‌నిపించాడు. ప్రేమ్‌ను గుంటూరులోని జీజీహెచ్‌కు తీసుకెళ్లినా ప్రయోజ‌నం లేకపోయింది.

ఆస్పత్రికి తీసుకువచ్చేటప్పటికే ప్రేమ్ మరణించాడ‌ని వైద్యులు చెప్పారు. ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు ఏసు, మళ్లీశ్వరి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గాయాలతో ఆ చిన్నారి పడిన బాధ హృద‌య విదార‌క‌ంగా ఉంది. ఈ సంఘటన నేపథ్యంలో సంబంధిత‌ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.