షాక్‌లో కమలనాథులు

11 December, 2018 - 8:49 PM

తెలంగాణతో సహా మిగిలిన నాలుగు రాష్ట్రాలు- మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ గఢ్-అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  వెలువడ్డాయి. దీంతో ప్రజలు తమ మనసులో ఏముందో అదే బ్యాలెట్‌పై గుద్దారని ఫలితాల సరళని చూస్తే అర్థమవుతోంది. అయితే తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పాగా వేయగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో… మూడు చోట్ల హస్తం హవా కొనసాగింది. ఇక మిజోరాంలో మాత్రం మరోసారి ఎంఎన్ఎఫ్ అధిక్యత తెచ్చుకుంది.

ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్‌ను నింపాయనే చెప్పాలి. అలాగే కమలనాధులకు మాత్రం ఇవి చేదు అనుభవాలనే మిగిల్చాయి. ఎందుకంటే.. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు బీజేపీకి కంచుకోటలు. సదరు రాష్ట్రాల్లో గత మూడు, నాలుగు పర్యాయాల పాటు వరుసగా బీజేపీ పాలించింది.

ఈ సారి కూడా బీజేపీనే వస్తుందని కమలనాధులంతా ఆశ పడ్డారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లుగా ఉంది తాజా పరిస్థితి. కానీ ఈ ఫలితాలను చూస్తుంటే… సదరు రాష్ట్రాల్లోని ఓటర్లు ఆచి తూచి.. బాగా ఆలోచించి మరీ ఓటు వేశారని మాత్రం అర్థమవుతోంది.

ఎందుకంటే.. మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలు దుందుడుకు చర్యలను తలపించాయి. ఉదాహరణకు సీబీఐ, ఈడీ సంస్థలను కేంద్రం జేబు సంస్థలుగా భావించినట్లు కనిపించింది. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులనే టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తోంది.

అలాగే ఎప్పుడు లేని విధంగా రిజర్వు బ్యాంకు వ్యవహారాలలో సైతం మోదీ ప్రభుత్వం తలదూర్చి నానా యాగీ చేస్తూ వచ్చింది. దీంతో స్వతంత్ర సంస్థల మనుగడ ప్రశ్నర్థకంగా మారింది.  రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కాంగ్రెస్‌కి  ప్రత్యామ్నాయంగా 2014లో బీజేపీని గెలిపిస్తే.. అందలం ఎక్కిన మోదీ… పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ సంచలనమై కూర్చున్నాయి. అంతేకాదు.. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో బీజేపీ పాలన కిందకు తీసుకు వచ్చేందుకు ఆయన చేసిన దుందుడుకు యత్నాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

అలాగే  పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి.  గ్యాస్ బండ ధర అయితే..  రోజురోజుకు రేటు మారుతూ…. సామాన్యుడి నడ్డి విరగగొడుతోంది. అదే విధంగా విజయ మాల్యా, నీరవ్ మోదీ.. తదితర ఆర్థిక నేరగాళ్లంతా విదేశాలకు పారిపోవడం, అలాగే సామాన్యుడికి ఆసరాగా ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని బలహీనపరచడం, సంస్కరణల పేరుతో వడ్డీలు తగ్గించడం, ప్రజలు ఎఫ్‌డీల రూపంలో బ్యాంకుల్లో దాచుకున్న నగదును ప్రభుత్వం బాండ్ల రూపంలో తెచ్చేందుకు బిల్లు కోసం సన్నాహాలు చేయడం .. వంటివి జనాన్ని ఠారెత్తించాయి.

జీఎస్టీ చిరువ్యాపారులను దెబ్బ తీసింది. పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక రంగాన్నే అస్తవ్యస్తంగా మార్చింది. ఇక రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్‌ను అంబానీ ఫ్యామిలీకి అప్పగించడం. సైతం పెను వివాదం రాజేసింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కృతకృత్యులయ్యారనే చెప్పాలి.

ఆ క్రమంలోనే ఒకే దశలో ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో హస్తం పార్టీ హవా నడిచిందంటే అదీ మాములు విషయం కాదని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.  ఇది కాంగ్రెస్ పార్టీకి బలవర్ధకమైన టానిక్ లాంటిదనే చెప్పాలి.  మొత్తం మీద సెమీ ఫైనల్స్ లాంటి ఈ ఎన్నికల్లో మోదీ క్లీన్ బోల్డ్ కాగా, మ్యాన్ ఆఫ్ ద సీరిస్‌గా రాహుల్ గాంధీ నిలిచారు. ఈ పరిణామాలు ముందు ముందు దేశరాజకీయాల గతినే మార్చేస్తాయన్నది పరిశీలకుల అంచనా.

-జి.వి.వి.ఎన్. ప్రతాప్