కారు- లారీ ఢీ: ఐదుగురు మృతి

21 August, 2018 - 4:49 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం మండలం పోడూరు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తమిళనాడు ధర్మపురిలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని ధర్మపురికి చెందిన రామ్మూర్తి అనే వ్యక్తికి పక్షవాతం రావడంతో నాటు వైద్యం కోసం కుటుంబ సభ్యులతో విరుపాక్షపురం వచ్చి మద్యం సేవించి ధర్మపురికి బయలుదేరారు. ఈ క్రమంలో పోడూరు వద్దకు రాగానే కుప్పం వైపు నుంచి ఓ లారీ వేగంగా వచ్చి వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. సంఘటన స్థలంలోనే రామ్మూర్తి, మోహన్‌, శేఖర్‌ మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక వృద్ధురాలు ఉన్నారు. మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.