ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యం..!

16 May, 2018 - 11:10 AM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ఇటు బీజేపీ, అటు జేడీఎస్‌- కాంగ్రెస్‌ పావులు కదుతుపుతుండటంతో ఊహించని మలుపులు తిరుగుతోంది. మెజారిటీ సంఖ్యాబలం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరాలని జేడీఎస్‌- కాంగ్రెస్‌ భావిస్తుండగా.. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ వాటి ప్రయత్నాలకు గండికొట్టి, తానే ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తోంది. ఇటు జేడీఎస్‌- కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అటు బీజేపీ ఆ రెండు పార్టీలను చీల్చాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది.

కాంగ్రెస్‌- జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్‌‌లో ఉన్నారని తెలుస్తోంది. సుమారు 15 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు శ్రీరాములుతో పాటు మరికొందరు సీనియర్‌ నేతలకు బీజేపీ అధినాయకత్వం ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే లింగాయత్‌ వర్గానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాయం అయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీ నాయకులకు ఆ ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం కాంగ్రెస్‌‌లో గుబులు రేపుతోంది. లింగాయత్‌ ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప రహస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది.ఇటు దేవెగౌడ కుమారుడు రేవణ్ణతో బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రేవణ్ణ వర్గం తమకు మద్దతిస్తే.. కేంద్రమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్‌ చేసినట్టు సమాచారం. మొత్తానికి ఇటు జేడీఎస్‌ నుంచి, అటు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలను తమవైపు ఫిరాయించేలా వ్యూహాలకు పదును పెట్టిన బీజేపీ ఆ మేరకు మైండ్‌‌గేమ్‌ కూడా ముమ్మరం చేసింది. ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతో టచ్‌‌లో ఉన్నారంటూ బీజేపీ ప్రచారం జోరుగా సాగిస్తోంది.

బీజేపీ బారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా ఇప్పుడు దృష్టిపెట్టింది. తాము గెలిచిన 78 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ కూడా బీజేపీలో చేరకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. అనుమానం ఉన్న ప్రతి ఎమ్మెల్యేను తాము అధికారంలో ఉన్న పంజాబ్‌‌లోని రిసార్ట్స్‌‌కు కాంగ్రెస్‌ పార్టీ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లింగాయత్‌ ఎమ్మెల్యేలు యడ్యూరప్ప పట్ల సానుకూలంగా ఉన్నారని తెలుస్తుండటం కాంగ్రెస్‌‌ను కలవరపెడుతోంది. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం దూతలు అశోక్‌ గెహ్లాట్‌, గులాం నబీ ఆజాద్‌ అనుమానమున్న ఎమ్మెల్యేలతో నేరుగా సంప్రతింపులు జరుపుతున్నారు.