గుడిలోకి తొలిసారి పురుషులకు ప్రవేశం!

23 April, 2018 - 2:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భువనేశ్వర్: ఈ పురాతన ఆలయంలో నాలుగు శతాబ్దాల (400 ఏళ్ళ) తర్వాత పురుషులకు తొలిసారిగా ఆలయ ప్రవేశ భాగ్యం లభించింది. ఇంత వరకూ ఈ ఆలయంలోకి పురుషులకు అనుమతి లేదు. సాంప్రదాయాలను పక్కనపెట్టి తొలిసారిగా పురుషులను ఈ ఆలయంలోకి అనుమతించారు. ఆలయంలోని గర్భగుడిలోకి ఏనాడూ కూడా పురుషులను అనుమతించకపోవడం విశేషం.

ఒడిశాలోని కేంద్రపారా జిల్లా సతాభ్యా అనే గ్రామంలో పంచువారాహి దేవత ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉందని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో పురుషులకు అనుమతి లేదు. వివాహితులైన ఐదుగురు దళిత మహిళలు మాత్రమే ప్రతి రోజూ ఆలయంలో నిత్య శుద్ధి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా బంగాళాఖాతంలో నీటి మట్టం పెరుగుతోంది. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఒడిశా విపత్తు నిర్వహణల శాఖ, ప్రపంచబ్యాంకులు సంయుక్తంగా ఓడిఆర్‌‌పీ పేరుతో పునరావాస కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే సతాభ్యా గ్రామాన్ని తరలించాయి. అయితే తమ గ్రామాన్ని ఇంతకాలంగా రక్షించిన పంచువారాహి దేవాలయాన్ని కూడా తరలించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకొన్నారు.

సతాభ్యా నుంచి బాగాపాటియా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ అధికారుల సాయంతో గ్రామస్థులు కొత్త ఆలయం నిర్మించుకున్నారు. కానీ.. దేవాలయంలో ఉన్న ఐదు విగ్రహాలను తరలించడం మహిళలకు కష్టంగా మారింది. ఐదు భారీ రాతి విగ్రహాలు ఒక్కొక్కటి టన్నున్నర బరువు ఉన్నాయి. దీంతో వాళ్లు పురుషుల సాయం తీసుకోక తప్పలేదు. ఏప్రిల్‌ 20న ఐదుగురు వ్యక్తుల సాయంతో విగ్రహాలను తొలగించి.. పడవ ద్వారా కొత్త ఆలయానికి తరలించారు.

శుద్ధి కార్యక్రమం నిర్వహించి.. కొత్తగా నిర్మించిన ఆలయంలో పూజలు నిర్మించారు. ఎట్టకేలకు 400 ఏళ్ళ తర్వాత ఈ ఆలయంలోకి విగ్రహాల తరలింపు కారణంగా పురుషులకు ప్రవేశం లభించడంగమనార్హం.