నిలిచిన భారత్-కివీస్ సెమీస్‌ ఫైట్

09 July, 2019 - 9:48 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మాంచెస్టర్‌ (ఇంగ్లండ్): అనుకున్నట్లే జరిగింది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ తొలి సెమీస్‌ వరుణుడు పలకరించేశాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌కు అడ్డంకిగా నిలిచాడు. భారీ వర్షం అయితే.. కాదు గానీ చిరుజల్లులు కురిపిస్తున్నాడు. ఈ ముసురుతో పిచ్‌, ఔట్‌ఫీల్డ్‌పై తేమ పెరుగుతున్నట్టు గ్రహించిన అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 211 పరుగులతో బరిలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రాస్‌ టేలర్‌ (67 నాటౌట్‌), లాథమ్‌ (3నాటౌట్‌) ఉన్నారు. ఆటను అంపైర్లు నిలిపివేడంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు.

కాగా.. కురుస్తున్నది చిరుజల్లులే కనుక వీలైదే లక్ష్య ఛేదనలో టీమిండియాను 20 ఓవర్లు అయినా ఆడించాలని ఐసీసీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మంగళవారం మ్యాచ్ నిర్వహించడం వీలుకాకపోతే ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి రిజర్వు డే అయిన బుధవారం ఆడిస్తారు. అప్పుడూ కుదరకపోతే లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న టీమిండియా ఫైనల్‌ చేరుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ రోజే మ్యాచ్‌ ముగించడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తారని అందుతున్న సమాచారం.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌కు టీమిండియా బౌలర్లు పెద్ద షాక్ ఇచ్చారు. భువనేశ్వర్‌ (1/30), జస్ప్రీత్‌ బుమ్రా (1/25) తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌ వేశారు. ఫామ్‌లో లేని కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (1; 14 బంతుల్లో)ను ఒక్క పరుగు వద్దే బుమ్రా ఔట్‌ చేసి ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో హెన్రీ నికోల్స్‌ (28; 51 బంతుల్లో 2×4)తో కలిసి కేన్‌ విలియమ్సన్‌ (67; 95 బంతుల్లో 6×4) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టు స్కోరు 69 వద్ద ఓ అద్భుతమైన బంతితో నికోల్స్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 68 పరుగుల కివీస్ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన రాస్‌ టేలర్‌ (67*; 85 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి కేన్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలింగ్‌ దెబ్బకు కివీస్‌ 29 ఓవర్లకు గానీ 100 పరుగుల మైలురాయి చేరలేకపోయింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటయ్యాడు. అప్పుడు స్కోరు 134/3. జేమ్స్‌ నీషమ్‌ (12; 18 బంతుల్లో 1×4) కాసేపు నిలిచాడు. నీషమ్‌ను పాండ్య ఔట్‌ చేశాడు. క్రీజులోకి వచ్చిన కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ (16; 10 బంతుల్లో 2×4)తో కలిసి టేలర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సమయంలోనే వర్షం మొదలైంది.