11న ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్

05 September, 2019 - 9:48 PM

టాలీవుడ్ సోలో హీరోయిన్ అనుష్కశెట్టి తాజాగా నటిస్తున్న మూవీ ‘నిశ్శబ్దం’. భాగమతి సినిమా విడుదల అయిన చాలా రోజుల తర్వాత అనుష్క ఈ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిశ్శబ్దం మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ రెడీ అయింది. ఈ నెల 1న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు నిశ్శబ్దం ఫస్ట్ లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సోలో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క.. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుండటంతో నిశ్శబ్దం సినిమాపై అంచనాలు భారీగా వస్తున్నాయి.

అనుష్కతో పాటు ఈ మూవీలో ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో కూడా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా వస్తోంది. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభొట్ల‌, కోన వెంక‌ట్ ఈ మూవీని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.