స్టాలిన్‌కి ‘ఫలితాలు’ చెప్పిన కేసీఆర్

13 May, 2019 - 8:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: ఎన్నికల ఫలితాల వెలువడేందుకు పట్టుమని పది రోజులు లేదు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తన పెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఆ క్రమంలో సోమవారం చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు.

ఆశ్వారుపేటలోని స్టాలిన్ నివాసంలో ఈ భేటీ దాదాపు గంటకు పైగా సాగింది. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై వారిరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో అటు కాంగ్రెస్‌కి, ఇటు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశమే లేదని ఈ సందర్భంగా స్టాలిన్‌తో కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం.

ఆ క్రమంలో ప్రాంతీయ పార్టీలతో బలమైన కూటమిగా ఏర్పాటయ్యే పెడరల్ ఫ్రెంట్ వల్ల ఒనగూడే ఫలితాలను స్టాలిన్‌కు కేసీఆర్ పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. అందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలును ఒకే తాటిపైకీ తీసుకు వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వీరిరువురు చర్చించారని తెలుస్తోంది.

ఈ భేటీలో టీఆర్ఎస్ ఎంపీలు బి. వినోద్ కుమార్, జి సంతోష్ కుమార్, డీఎంకే నేతలు దురై మురుగన్, టీఆర్ బాలు పాల్గొన్నారు. అయితే ఈ భేటీ అనంతరం స్టాలిన్, కేసీఆర్ మీడియాతో మాట్లాడకపోవడ కోసమెరుపు. ఆ తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వచ్చేసింది.