తగ్గిన ప్రీమియం రైళ్ళ చార్జీలు

17 April, 2018 - 4:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌‌ప్రెస్‌ లాంటి ప్రీమియం రైళ్ల చార్జీలు తగ్గాయి. ఆహార పదార్థాలపై జీఎస్టీ చార్జీలను తగ్గించడంతో టిక్కెట్‌ ధరలు కూడా కిందకి దిగి వచ్చినట్టు సమాచారం. సోమవారం నుంచి రైళ్లు, ప్లాట్‌ఫామ్‌ వద్ద విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకుల ధరలను ఇండియన్‌ రైల్వేస్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తగ్గించింది. దీంతో మీల్స్‌ ధరలు కలిసి ఉండే ప్రీమియం రైళ్ల టిక్కెట్‌ ధరలు కూడా తగ్గాయి. జీఎస్టీ రేటును తగ్గించడంతోనే ఆహార పదార్థాల ధరలు తగ్గించామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌ల వద్ద, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు విక్రయించే ఆహార పదార్థాలు, డ్రింకులన్నింటిపైన కూడా ఒకేవిధమైన జీఎస్టీ రేటు 5 శాతాన్ని విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకు ముందు ఈ రేటు 18 శాతంగా ఉండేది. ఈ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంతో, ప్రీమియం రైళ్ల టిక్కెట్‌ ధరలు ఒక్కో టిక్కెట్‌‌పై రూ.40 నుంచి రూ.60 మధ్యలో తగ్గాయి.

రైల్వే లైసెన్సులతో దోపిడీకి పాల్పడుతున్న వారిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ దేశీయ రైల్వే మొబైల్‌, స్టాటిక్‌ కేటరింగ్‌‌కు పలు రేట్లను అమలు చేస్తోంది.
జీఎస్టీ రేటు తగ్గింపుతో ఐఆర్‌‌సీటీసీ అధికారిక లైసెన్సీలు అమ్మాల్సిన ఆహార పదార్థాల ధరలు ఇలా ఉన్నాయి..
చికెన్‌ బిర్యానీ ప్లేటుకు 89 రూపాయలు, అంతకు ముందు రూ.100
ఎగ్‌ బిర్యానీ ప్లేటుకు 61 రూపాయలు, అంతకు ముందు రూ.69
మసాలా దోశ ప్లేటుకు 18 రూపాయలు, అంతకు ముందు రూ.21
సూప్‌‌లు, వెజ్‌ నూడుల్స్‌, రైస్‌ పదార్థాలకు రైల్వే ప్రయాణికులకు రూ.2 నుంచి రూ.4 తగ్గనుంది. జీఎస్టీ మినహాయింపు ఉన్న టీ, కాఫీ, రైల్వే నీర్‌, స్టాండర్డ్‌ బ్రేక్‌‌ఫాస్ట్‌, ఎకానమీ మీల్స్‌ వంటి వాటి ధరల్లో మార్పు లేదు.