త్వరలో జీఎస్టీ రేట్ల తగ్గింపు?!

08 June, 2018 - 12:30 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్లపై త్వరలో మనం శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ పన్ను రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయంటూ ఇప్పటికే పలు వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. దీంతో జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ కృషిచేస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ కృషిచేస్తోందని తెలిసింది.

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ చేపట్టిన 7వ ఎడిషన్‌ ఢిల్లీ ఎస్‌ఎంఈ ఫైనాన్స్‌ సమిట్‌‌లో ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా చెప్పారు. ‘జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ పనిచేస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఓ పెద్ద ప్రకటన వచ్చేస్తోంది’ అని శివ్‌ ప్రతాప్‌ అన్నారు.

జీఎస్టీ పన్ను రేట్లు ప్రస్తుతం నాలుగు శ్లాబులుగా అమలవుతోంది. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. కానీ ఈ రేట్లు అ​త్యధిక మొత్తంలో ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. జనవరి నెల ప్రారంభంలో జీఎస్టీ కౌన్సిల్‌ 54 సర్వీసులు, 24 ఉత్పత్తుల రేట్లను తగ్గించింది. వీటిలోముఖ్యంగా హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. 2017 నవంబర్‌ సమావేశంలో కూడా 28 శాతం కేటగిరీలో ఉన్న 178 ఉత్పత్తులను, ఆ శ్లాబు నుంచి తొలగించింది.

మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని దేశంలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ధరలను అదుపులో ఉంచవచ్చని పలువురు పేర్కొంటున్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం కూడా తీవ్రంగా కసరత్తు చేస్తోంది.