‘అప్పుడు చెబుతా’

17 March, 2020 - 8:02 PM

(న్యూవేవ్స్ డెస్క్)

గౌహతి: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గోగోయ్‌ను రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం  నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ రంజన్ గోగోయ్‌పై విపక్షాలతోపాటు మాజీ న్యాయమూర్తులు విమర్శులు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై జస్టిస్ రంజన్ గోగోయ్ మంగళవారం గౌహతిలో స్పందించారు. రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆరోపణలపై స్పందిస్తానని ఆయన వివరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే జస్టిస్ రంజన్ గోగోయ్‌కు పదవి విరమణ తర్వాత రాజ్యసభకు నామినేట్ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నియామకంపై ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఫైర్ బ్రాండ్ నేత మౌహివ మోయిత్రా అయితే .. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. జస్టిస్ రంజన్ గోగోయ్‌ను పెద్దల సభకు పంపడం తనకు ఏ మాత్రం అశ్చర్యం కలిగించ లేదని అన్నారు. ఎన్ఆర్సీని అనుమతించడం, రామమందిరంపై తీర్పు వెలువరించడం, జమ్ము కశ్మీర్ వ్యవహారాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారించకపోవడం, లైంగిక ఆరోపణలు వస్తే.. వాటి నుంచి తనను తాను రక్షించుకోవడం.. లాంటి కారణాలతోనే జస్టిస్ రంజన్ గోగోయ్‌ను రాజ్యసభకు పంపారని మోయిత్రా విమర్శించారు. జస్టిస్ రంజన్ గోగోయ్‌ను పెద్దల సభకు పంపడం వెనక క్విడ్ ప్రోకో దాగి ఉందనే విమర్శులు సైతం వెల్లువెత్తుతున్నాయి.

అయితే జస్టిస్ రంజన్ గోగోయ్‌కు ఏదో రోజు రాజకీయ పదవి వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుందని మాత్రం అనుకోలేదని జస్టిస్ రంజన్ గోగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై ఆయన సహచరుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిణామాలు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నార్థకంగా మారుస్తాయని మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డారు.

జస్టిస్ దీపక్ మిశ్రా ప్రవర్తనకు వ్యతిరేకంగా.. జస్టిస్ రంజన్ గోగోయ్‌తో కలిసి.. అసాధారణ రీతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్లో మదన్ బి లోకూర్ ఒకరు. జస్టిస్ రంజన్ గొగోయ్‌ను మార్చి 16వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేషన్ చేసిన సంగతి తెలిసిందే.

రాజ్యసభ పొందిన రెండోవ సీజేఐ రంజన్ గోగోయ్. గతంలో సీజేఐగా పని చేసిన రంగనాథ్ మిశ్రా 1991లో  పదవి విరమణ చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో 1998లో రంగనాథ్ మిశ్రాను రాజ్యసభకు పంపింది కాంగ్రెస్ పార్టీ. అలాగే సీజేఐగా పని చేసిన పి. సదాశివంను కేరళ గవర్నర్‌గా నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించిన విషయం విదితమే.