లక్ష్మీనారాయణ ఆ పార్టీలోనే చేరతారా?

23 March, 2018 - 5:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మహారాష్ట్ర అదనపు డీజీపీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వచ్ఛంద పదవి విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసు కున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి కోరుతూ మహారాష్ట్ర డీజీపీ ద్వారా ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ 1990లో ఐపీఎస్‌కు  సెలెక్ట్టయ్యారు. ఆయన మహారాష్ట్ర క్యాడర్‌చెందిన అధికారి అన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన కమలం గూటిలో చేరుతున్నారని తెలుస్తోంది.  ఆయనకు భారతీయ సనాతన ధర్మం పట్ల అనురక్తి, స్వామి వివేకానంద బోధనల పట్ల అమిత భక్తి ఉందని ఆయనను ఎరిగినవారు చెబుతారు. హిందుత్వ పార్టీ అయిన బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ అగ్రనేతలు ఎప్పటి నుంచో లక్ష్మీనారాయణను కోరుతున్నారని సమాచారం. అందుకు తనకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆయన మార్చి 22న వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేశారు.

లక్ష్మీనారాయణను పెద్దల సభకు నామినేట్ చేసేందుకు ఇప్పటికే కమలనాధులు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.  అదీకాక… ప్రధాని మోదీ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పలువురు మాజీ ఐపీఎస్, మాజీ ఐపీఎస్‌లకు చోటు కల్పించారు. అందులోభాగంగా ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో కొనసాగుతున్న విషయం విదితమే.

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ విద్యాసంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని.. భారతీయతోపాటు పలు అంశాలపై ఆసక్తికర విషయాలు చెబుతుంటారు.

ఆయన సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. సత్యం కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల వ్యవహారం, ఓబుళాపురం మైనింగ్ అక్రమ మైనింగ్ లీజ్ వ్యవహారంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి అక్రమ వ్యాపారం, మావోయిస్టు నేత ఆజాద్ ఎన్‌కౌంటర్ తదితర కేసుల దర్యాప్తుతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

వీఆర్‌ఎస్‌కు అనుమతి వచ్చిన తర్వాత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. ఆయన సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకొందరు పవన్ కళ్యాణ్ జనసేనలో చేరతారని కూడా అంటున్నారు. అయితే ఇంతదాకా లక్ష్మీనారాయణ నుంచి ఎలాంటి సంకేతాలూ వెలువడలేదు. కానీ ఆయన బీజేపీలోనే చేరతారని ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలుస్తోంది.