ఫైనల్లో కివీస్‌తో ఇంగ్లండ్ అమీతుమీ

11 July, 2019 - 10:43 PM

              (న్యూవేవ్స్ డెస్క్)

బర్మింగ్‌హామ్‌: ఐసీసీ ప్రపంచకప్ 2019లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఫైనల్స్‌కు చేరింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో గురువారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగినట్లయింది. ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో ఈ నెల 14 ఆదివారం జరిగే అంతిమ సమరంలో ఇంగ్లండ్ జట్టు తొలి సెమీఫైనల్ విన్నర్ న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ జట్టు తన ముందుంచిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 32.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు జాసన్ రాయ్ (85), జానీ బెయిర్ స్టో (34) పటిష్టమైన పునాది వేశారు. కెప్టెన్ మోర్గాన్ (45), జో రూట్ (49) మిగతా క్రతువును పూర్తిచేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

అంతకు ముందు రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌కు 224 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. స్టీవ్‌ స్మిత్‌ (85), అలెక్స్‌ క్యారీ (46)లు రాణించడంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ విలవిల్లాడింది. దీంతో కనీసం 200 పరుగులు దాటుతుందా అనుకున్నారు. అయితే స్మిత్‌, క్యారీలు ఆదుకున్నారు. చివర్లో మ్యాక్స్‌ వెల్‌ (26), స్టార్క్‌(29) రాణించారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌, వోక్స్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఆర్చర్‌ రెండు వికెట్లు, వుడ్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.

ఈ ఓటమితో గత వరల్డ్‌కప్ విజేతగా, డిఫెండింగ్ చాంపియన్‌గా తాజా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా కథ సెమీస్‌తోనే ముగిసింది. న్యూజిలాండ్ జట్టు ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ గతేడాది కూడా ఫైనల్ చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రపంచకప్ 2019 ఫైనల్ చేరిన ఇరు జట్లలో ఏదీ కప్ గెలిచినా అది చరిత్ర అవుతుంది. ఇంగ్లండ్ క్రికెట్‌కు పుట్టినిల్లు అయినా ఇంతవరకూ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రపంచకప్ గెలవలేదు. మరోవైపున న్యూజిలాండ్ ఇప్పటికి ఎనిమిదిసార్లు సెమీస్ ఆడి, రెండు పర్యాయాలు ఫైనల్ చేరింది. ఈసారి కప్ గెలిచి వరల్డ్‌కప్ విన్నర్స్ క్లబ్‌లో చేరాలని ఉవ్విళ్ళూరుతోంది.ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగంలో బలంగా తాకింది. దాంతో క్యారీ విలవిల్లాడిపోయాడు. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత క్యారీ బ్యాటింగ్‌ కొనసాగించేందుకు మొగ్గు చూపాడు. కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌ చేయడం అతనికి క్రీడపై ఉన్న నిబద్ధతకు అద్దం పట్టింది.