యాషెస్‌లో ఇంగ్లండ్ అద్భుతం

25 August, 2019 - 10:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లీడ్స్: టెస్ట్ క్రికెట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన జట్లు మ్యాచ్‌లో కోలుకోవడం చాలా అరుదనే చెప్పాలి. అలా కోలుకుని మ్యాచ్‌లో విజయం సాధిస్తే మాత్రం అది నిస్సందేహంగా అత్యద్భుతమే. గతంలో ఆస్ట్రేలియాపై కోల్‌కతాలో టీమిండియా కూడా అలాంటి అద్భుతాన్నే చేసింది. ఇప్పుడు యాషెస్ సీరీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ అలాంటి నమ్మశక్యం కాని విజయాన్నే సాధించింది. అది కూడా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 67 పరుగులకు ఆలౌటైన జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 359 పరుగుల విజయ లక్ష్యాన్ని నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఛేదిస్తుందని ఎవరైనా ఊహించగలరా? కానీ.. ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఒంటరి పోరాటంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఒక వైపున వికెట్లు పడిపోతున్నా మొండిపట్టుదలతో ఆడిన స్టోక్స్ చివరి వికెట్ అండతో ఇంగ్లండ్ జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. స్టోక్స్ 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి ఒంటిచేత్తో ఇంగ్లండ్ పేజీలో గెలుపు కావ్యాన్ని రాశాడు. ముందుగా బౌలర్ల ఆధిపత్యం సాగడం చూసి రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును మడత పెట్టేయొచ్చని భావించిన ఆసీస్ జట్టుకు ఘోర పరాభవమే ఎదురైంది. ఇంగ్లీష్ జట్టు చివరి వికెట్ పడగొట్టలేక కంగారూ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఈ సంచలన విజయం సాధించి ఐదు టెస్టుల సీరీస్‌ను 1-1తో సమం చేసింది. 359 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లు నష్టపోయి అద్భుత విజయాన్ని అందుకుంది. మొత్తానికి ఇంగ్లండ్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 179 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 67 పరుగులకే కుప్పకూలిపోయింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 359 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. జో రూట్ (77), జోయ్ డెన్లీ (50), బెయిర్ స్టో 36 పరుగులతో ఓ మోస్తరు పోరాటం చేయగా, బెన్ స్టోక్స్ రంగప్రవేశంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయిందని చెప్పాలి. బ్యాటింగే రాని మార్క్ లీచ్ (1)ను అడ్డంపెట్టుకుని స్టోక్స్ కంగారూల పనిపట్టాడు. తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 4, లియోన్‌ 2, కమిన్స్‌, పాటిన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. యాషెస్‌ సీరీస్‌లో తొలి టెస్ట్‌ను ఆసీస్‌ గెలవగా.. రెండో టెస్ట్‌ వర్షార్పణం అయింది. మూడో టెస్ట్‌ను ఇంగ్లండ్‌ గెలిచి సీరీస్‌ను సమం చేసింది. నాలుగో టెస్ట్‌ మాంచెస్టర్‌ వేదికగా వచ్చే నెల నాలుగో తేదీన ప్రారంభమవుతుంది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 179 పరుగులు

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 67 పరుగులు

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 246 పరుగులు

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 362 పరుగులు.