ఆఫ్ఘన్‌పై ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ

19 June, 2019 - 2:55 AM

(న్యూవేవ్స్ డెస్క్)

మాంచెస్టర్‌: ఐసీసీ వరల్డ్‌ కప్‌లో ఆతిథ్యం ఇంగ్లండ్‌ జట్టు ఖాతాలో విక్టరీ వచ్చి చేరింది. ఆఫ్ఘనిస్థాన్‌తో మంగళవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫెర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీని కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (148- 71బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. మోర్గాన్‌తో పాటు బెయిర్‌స్టో (90- 99 బంతుల్లో), రూట్‌ (88- 82 బంతుల్లో) అర్ధ శతకాలతో రాణించడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయగలిగింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలమైన ఇంగ్లండ్‌ జట్టు పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ను చెడుగుడు ఆడుకుందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్‌లో విశ్వరూపం చూపించి అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విజయం సాధించింది. ఆఫ్ఘన్‌ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 17 సిక్స్‌లు కొట్టి వన్డేల చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 71 బంతులు ఎదుర్కొని 17 సిక్సులు,  4 బౌండరీలతో 148 పరుగులు చేశాడు.

అయితే.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్థాన్‌ చివరి వరకూ పోరాడడం విశేషం. ఇంగ్లండ్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ గొప్ప పట్టుదల ప్రదర్శించడం అందరినీ ముచ్చటగొలిపింది. పరుగులు రాబట్టలేక పోయినా.. చివరి వరకూ నిలిచి అభిమానుల హృదయాల్ని దోచుకుంది. కానీ చివర్లో ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు పడిపోవడంతో 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 247 పరుగులకే పరిమితమైంది. హస్మతుల్లా (76- 10 0బంతుల్లో), రహమత్‌ (46- 74 బంతుల్లో), అస్ఘర్‌ (44- 48 బంతుల్లో) గొప్ప పోరాట ప్రతిమతో ఆకట్టుకున్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిదానంగా ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. తొలి పది ఓవర్లలో ఇంగ్లండ్‌ 46 పరుగులు చేసి ఓ వికెట్‌ పోగొట్టుకుంది. ఓపెనర్‌ జేమ్స్‌ విన్సి (26) జట్టు స్కోరు 44 వద్ద మైదానాన్ని వీడాడు. ఆఫ్ఘన్‌కు అదొక్కటే సంతోషం కలిగించే విషయం. ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితి. అప్పటి వరకూ నెమ్మదిగా ఆడుతున్న బెయిర్‌స్టో సహచరుడు జో రూట్‌ సహకారంతో వేగంగా ఆడి అర్ధశతకం అందుకున్నాడు. రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం అందించాడు. బౌండరీలు, సిక్సర్లతో భారీ విధ్వంసం సృష్టించాడు. అయితే శతకానికి చేరువైన అతడిని 30వ ఓవర్లో గుల్బదిన్‌ నయీబ్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 164.ఇక క్రీజులోకి రావడమే ఆలస్యం అన్నట్లు ఇంగ్లండ్ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్లు బాదడం మొదలుపెట్టాడు. 36 బంతుల్లో అర్ధశతకం.. 57 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఇది నాలుగో అత్యంత వేగవంతమైన శతకం. అప్పటికే అతడు 11 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఇంగ్లండ్‌ 43.5 ఓవర్లకు 300 స్కోరు అందుకుంది. సెంచరీ తర్వాత మోర్గాన్ మరింత చెలరేగిపోయాడు. ఎడాపెడా సిక్సర్లు కొట్టాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు ఉతికేశాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు సృష్టించాడు. క్రిస్‌గేల్‌ (16 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (16) ఘనతను వెనక్కి నెట్టేశాడు. మరోవైపు రూట్‌ సైతం అర్ధశతకం చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. జట్టు స్కోరు 350 దాటిన తర్వాత గుల్బదిన్‌ నయీబ్‌ వేసిన 47వ ఓవర్లో  వీరిద్దరూ పెవిలియన్‌ బాట పట్టారు. బెన్‌స్టోక్స్ (2), బట్లర్‌ (2) విఫలమైనా చివర్లో మొయిన్‌ అలీ తనదైన శైలిలో భారీ సిక్సర్లు కొట్టి స్కోరు 397కు చేర్చాడు.

భారీ లక్ష్యంతో మైదానంలో అడుగుపెట్టిన ఆప్ఘన్‌ రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ నూర్‌ అలీ వికెట్‌ కోల్పోయింది. తర్వాత రహమత్‌తో కలిసి గుల్బదిన్‌ గొప్ప పోరాటమే చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఎదుర్కొంటూ కుదురుకునే ప్రయత్నం చేశాడు. నాలుగు బౌండరీలు, ఓ సిక్సర్‌తో కాసేపు ఆకట్టుకున్నాడు. కానీ 12 ఓవర్‌లో మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో గుల్బదిన్‌ (37) బట్లర్‌ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్‌ను బట్లర్‌ అందుకున్న తీరు అద్భుతం. అప్పుడు క్రీజులోకి వచ్చిన హస్మతుల్లా.. రహమత్‌తో కలిసి నిదానంగా స్కోరుబోర్డును నడిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను అసహనానికి గురిచేస్తూ వికెట్‌ ఇవ్వకుండా ఈ జోడీ బాగానే ఆడింది. కానీ 25వ ఓవర్‌లో రషీద్‌.. రహమత్‌ (46)ను పెవిలియన్‌కు పంపి ఈ జోడీని విడగొట్టాడు. తర్వాత వచ్చిన అస్ఘర్‌ (44)తో కూడా హస్మతుల్లా  మంచి భాగస్వామ్యమే నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 35వ ఓవర్‌ ఆఖరి బంతికి బౌండరీ బాది హస్మతుల్లా అర్ధశతకం పూర్తి చేశాడు. కానీ రషీద్‌, మార్క్‌ వుడ్‌, ఆర్చర్‌ చివర్లో కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఆఫ్ఘన్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. అప్పటికే ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటం.. ఓవర్లు కూడా పూర్తి అవడంతో ఆఫ్ఘనిస్థాన్ కు భారీ ఓటమి తప్పలేదు.