అణుయుద్ధానికి త్వరలో శుభం కార్డు..!

12 June, 2018 - 5:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సింగపూర్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌‌తో చర్చలు నిజాయితీగా, ఫలవంతంగా జరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. చరిత్రాత్మక భేటీ తరువాత ట్రంప్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

‘ఇది చరిత్రాత్మక సమావేశం. మార్పు సాధ్యమేనని మేమిద్దరం నిరూపించాం. సాహసికులే శాంతి ప్రక్రియ చేపట్టగలరు. ఉత్తర కొరియా ఇప్పటికే అణునిరాయుధీకరణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అణు కేంద్రంలోని సొరంగాలను ధ్వంసం చేసింది. ఉత్తరకొరియాతో కలిసి ఓ కొత్త చరిత్ర సృష్టించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. అణు యుద్ధానికి ముగింపు పలకాలని మేం నిర్ణయించుకున్నాం’.

‘ప్రపంచ చరిత్రలోని గొప్ప సంఘటనల్లో ఇది ఒకటి. పలు కీలక పత్రాలపై మేం సంతకాలు చేశాం. కిమ్‌ ఉత్తరకొరియా చేరుకోగానే ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాల ప్రక్రియను ప్రారంభిస్తారని ఆశిస్తున్నా. సరైన సమయం చూసుకొని నేను ప్యాంగ్యాంగ్‌ వెళ్తాను. అలాగే కిమ్‌‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తా. ఈ సమావేశం అమెరికాకు, ఉత్తర కొరియాకు మంచి చేకూరుస్తుందని భావిస్తున్నాను. మరోసారి చర్చల కోసం కిమ్‌‌ను ఆహ్వానిస్తా’ అని ట్రంప్‌ అన్నారు.

ఉత్తర కొరియాపై అమెరికా విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేస్తారా? అని మీడియా ప్రతినిధులు ట్రంప్‌‌ను ప్రశ్నించినప్పుడు ఆంక్షలను ఇప్పుడే ఎత్తివేయబోమని.. త్వరలోనే ఆ పని చేస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు.జీ-7 సమావేశం చక్కగా జరిగిందని ట్రంప్‌ తెలిపారు. ట్రంప్ చేతులు కట్టుకొని కుర్చీలో కూర్చుని ఉండగా.. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌‌తో పాటు ఇతర నేతలు టేబుల్‌‌పై చేతులు పెట్టి మాట్లాడుతున్న ఫొటో ఒకటి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌ స్పందించారు. ‘నేను కుర్చీలో కూర్చొని ఉండగా.. మెర్కెల్‌ టేబుల్‌‌పై చేతులు పెట్టి ఉన్న ఫొటో బయటకు వచ్చింది. డాక్యుమెంట్స్‌ కోసం ఎదురు చూస్తూ.. మేమందరం మాములుగా మాట్లాడుకుంటున్నాం’ అంతే అని ట్రంప్‌ వివరణ ఇవ్వడం గమనార్హం.

కాగా.. సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా ట్రంప్‌, కిమ్‌ జాంగ్‌ ఉన్‌‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక భేటీ ఫలప్రదమైంది. ఇరు దేశాల అధ్యక్షులు ఉమ్మడి తీర్మానంపై సంతకాలు చేశారు.

తీర్మానంలోని ముఖ్యాంశాలివీ..
– శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమెరికా, ఉత్తర కొరియాలు కొత్త సంబంధాలను నెలకొల్పుకుంటాయి.
– కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపనకు అమెరికా, ఉత్తర కొరియా కలిసి పనిచేస్తాయి.
– 2018 ఏప్రిల్ 27 నాటి పాన్‌ ముంగ్‌ జోమ్‌ తీర్మానానికి అనుగుణంగా సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉంటుంది.
– యుద్ధ ఖైదీలను తక్షణమే తిరిగి అప్పగించడం.