ఐటీ సెక్టార్‌కు 2018లో శుభాలే..!

31 December, 2017 - 4:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: వీసాలపై ఆంక్షలు, నియామకాల్లో కోత, లే ఆఫ్‌‌లతో 2017లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఐటీ పరిశ్రమ 2018లో ఏ దిశగా అడుగులు వేస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే.. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనప్పటికీ 2018లో ఐటీ సెక్టార్ నిలదొక్కుకుంటుందనే అంచనాలు వస్తున్నాయి. కంపెనీలు క్రమేపీ ఐటీ వ్యయాలను పెంచుతుండటం, పోటీని తట్టుకునేందుకు కొత్త టెక్నాలజీలపై దృష్టి సారించడంతో ఐటీ పరిశ్రమ 2018లో మళ్ళీ పుంజుకుంటుందని పరిశ్రమ వర్గాల అభిప్రాయం.

గడిచిన ఏడాది కాలంలో ఐటీ రంగంలో రాజకీయ, ఆర్థిక అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఇప్పటి వరకూ ఐటీ పరిశ్రమ మందగమనంలో ఉంది. అయితే రానున్న రోజుల్లో ఐటీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాది వీసా స్ర్కూటినీ పెరగడం, కంపెనీలు తిరిగి ఐటీ వ్యయాలు పెంచడంతో సాధారణ పరిస్థితి నెలకొంటుందని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌. చంద్రశేఖర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 2017-18లో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7 నుంచి 8 శాతంగా ఉంటుందన్న అంచనాలను అధిగమిస్తామని ఆయన చెప్పారు. అందువల్ల ఐటీ పరిశ్రమపై భయాందోళనలు అవసరం లేదని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. వీసా ఆంక్షలు సహా పలు ప్రతికూలతలు ఎదురైనా ఆటోమేషన్‌, కృత్రిమ మేథ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి నూతన టెక్నాలజీల ప్రవేశంతో ఐటీ పరిశ్రమ స్థిరంగా ముందుకు వెళుతుందని భావిస్తున్నారు.

ఐటీ బడ్జెట్లలో ఈ టెక్నాలజీలపై వెచ్చించే వ్యయం గణనీయంగా ఉండటంతో పరిశ్రమ వృద్ధిపై భయాందోళనలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఆటోమేషన్‌, డిజిటల్‌ వంటి కొత్త టెక్నాలజీల రాకతో ఉద్యోగాలు దెబ్బతింటాయన్న ఆందోళన నెలకొన్నా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా నికరంగా ఉపాధి కల్పించే పరిశ్రమగా ఐటీ ముందుంటుందనే సంకేతాలు వస్తున్నాయి.

ఐటీ కంపెనీలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకొంటున్నాయి. ఉద్యోగులకు నైపుణ్యాలను పెంచుకొనే శిక్షణలు కూడ కంపెనీలు ఇస్తున్నాయి.

డేటా అనలిటిక్స్‌, రోబోటిక్స్‌, కృత్రిమ మేథ వంటి కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంతో పాటు కంపెనీలు వినూత్న మోడల్స్‌‌తో ముందుకెళితే మందగమనాన్ని ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఐఐటీలు, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో క్యాంపస్‌ నియామకాలు ఊపందుకోవడం కూడా కొత్త ఏడాది ఐటీ రంగం జోరుగా ఉంటుందనే సానుకూల సంకేతాలు పంపుతున్నది.