ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

23 September, 2019 - 2:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల అయింది. నేటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని జిల్లా ఎన్నికల అధికారి అమేయ కుమార్ సూర్యాపేటలో వెల్లడించారు. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 21న నిర్వహిస్తామని.. అలాగే అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన ఉంటుందని చెప్పారు. ఇక అక్టోబర్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 3వ తేదీతో ముగియనుందన్నారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అయన సమీప ప్రత్యర్థి సైదిరెడ్డిపై 7 వేల ఓట్లు అధిక్యంతో గెలుపొందారు. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఉత్తమ్ హుజూర్ నగర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో సదరు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ సైదిరెడ్డిని ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్లు ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. తన భార్య పద్మావతి పేరు ప్రకటించారు. దీంతో సదరు పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరి పేరు ఖరారు చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 18 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాలకు కూడా అక్టోబర్ 21నే ఉప ఎన్నికలు జరగనున్నాయి.